Cheese | పాలతో తయారు చేసే పదార్థాల్లో చీజ్ ఒకటి. చీజ్ తో రకరకాల పదార్థాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. చీజ్ తో చేసే పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఫ్రిజ్‌లో చీజ్‌ను నిల్వ చేయడం చాలా మందికి ఉన్న అలవాటు. దాన్ని ఎలా నిల్వ చేస్తున్నామన్న విషయం చీజ్ నాణ్యత, తాజాదనం, ఆరోగ్య భద్రతపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చీజ్‌ను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయడం సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, అది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.
చీజ్‌ను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచినప్పుడు లోపల తేమ ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేమ కారణంగా అవాంఛిత ఫంగస్ (మోల్డ్) వేగంగా పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా ఇలాంటి తడి వాతావరణంలో సులభంగా పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు. చీజ్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్లాస్టిక్‌లోని కొన్ని పదార్థాలు ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందని ఆహార భద్రత నిపుణులు చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చీజ్‌ను సురక్షితంగా నిల్వ చేయాలంటే కాగితం ఆధారిత ర్యాపింగ్ను ఉపయోగించడం మంచిది. పార్చ్మెంట్ పేపర్ లేదా వెక్స్ పేపర్లో చీజ్‌ను చుట్టి, ఆ తర్వాత మూత ఉన్న డబ్బాలో ఉంచితే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ విధానం వల్ల చీజ్‌కు అవసరమైనంత గాలి ప్రసరణ లభించడంతోపాటు అదనపు తేమ పేరుకుపోకుండా ఉంటుంది. కాగితం చీజ్‌ను శ్వాసించడానికి అవకాశం కల్పిస్తుంది. దీంతో దాని సహజ రుచి, ఆకృతి, తాజాదనం ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అదే సమయంలో ఫంగస్ పెరుగుదల ప్రమాదం కూడా తగ్గుతుంది. అందువల్ల ఫ్రిజ్‌లో చీజ్‌ను నిల్వ చేసే సమయంలో ప్లాస్టిక్ సంచులను ఉపయోగించే బదులుగా పార్చ్మెంట్ లేదా వెక్స్ పేపర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఈ చిన్న మార్పు చీజ్‌ను ఎక్కువకాలం తాజాగా ఉంచడమే కాకుండా ఆహార భద్రతను కూడా మెరుగుపరుస్తుంది.