Dry Eyes | ప్రస్తుతం పెరుగుతున్న స్క్రీన్ వినియోగం, వాయు కాలుష్యం, ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువసేపు గడపడం వంటి కారణాలతో కళ్ల నుంచి నీరు కారడం, మంట, చికాకు వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. చాలామంది కళ్లలో నీరు వస్తే కళ్లకు తేమ బాగానే ఉందని భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అదే లక్షణం డ్రై ఐ (కళ్లు పొడిబారడం) సమస్యకు సంకేతంగా ఉంటుందని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్ల నుంచి నిరంతరం నీరు కారడం, అదే సమయంలో డ్రై ఐ అని నిర్ధారణ కావడం పరస్పర విరుద్ధంగా అనిపించినా, ఇది సాధారణంగా కనిపించే పరిస్థితే. కంటి ఉపరితలాన్ని కప్పి ఉంచే కన్నీటి పొరలో నూనె, నీరు, శ్లేష్మం అనే మూడు పొరలు ఉంటాయి. ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే కంటి ఉపరితలం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పొర దెబ్బతిన్నప్పుడు కంటి నుంచి మెదడుకు సంకేతం వెళ్లి అత్యవసరంగా ఎక్కువ కన్నీరు ఉత్పత్తి చేస్తుంది. దీనినే రిఫ్లెక్స్ టియరింగ్ అంటారు. ఈ కన్నీరు ఎక్కువగా వచ్చినప్పటికీ కంటికి అవసరమైన తేమ మాత్రం అందదు. అందుకే కంటి పొడిబారినట్లే ఉండి, ఒకేసారి నీరు కూడా కారుతూ ఉంటుంది.
ఇటీవలి కాలంలో డ్రై ఐ సమస్య వేగంగా పెరగడానికి జీవనశైలిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణంగా చెబుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు సాధారణంగా కళ్లను మూసి తెరిచే సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో కనురెప్పలలోని ఆయిల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం, కన్నీటి పొర వేగంగా ఆవిరైపోవడం జరుగుతుంది. దీనికి తోడు కాలుష్యం, ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలు, ఎక్కువసేపు ప్రయాణాలు వంటి అంశాలు కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. సాయంత్రం సమయానికి కళ్ల నుంచి నీరు ఎక్కువగా కారడం, కళ్లలో మంట లేదా గుచ్చినట్లు అనిపించడం, చూపు అప్పుడప్పుడు మసకబారినా రెప్పవేయగానే మళ్లీ స్పష్టంగా కనిపించడం, గాలి లేదా ఏసీ తగిలితే అసౌకర్యంగా అనిపించడం, రాత్రి బాగా నిద్రపోయినా కళ్లలో అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఇవి రెండు వారాలకు పైగా కొనసాగితే తప్పకుండా కంటి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమస్యను తగ్గించేందుకు కనురెప్పలపై గోరువెచ్చని వస్త్రంతో కాపడం పెట్టడం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారం లేదా సప్లిమెంట్లు తీసుకోవడం, ప్రిజర్వేటివ్‌లు లేని లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడడం, స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడిపేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకుని ఉద్దేశపూర్వకంగా రెప్పలు వేయడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. సమస్య ఎక్కువకాలం కొనసాగితే వైద్యుల సూచన మేరకు ప్రత్యేక కంటి చుక్కలు లేదా ఆయిల్ గ్రంథుల పనితీరును మెరుగుపరిచే చికిత్సలు అవసరం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.