Cream | పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒకటి. ప్రతి శుభకార్యంలో ఇప్పుడు కేక్ కట్టింగ్ తప్పనిసరైందని చెప్పవచ్చు. అయితే కేక్‌పై ఉండే క్రీమ్ నిజమైన డెయిరీ క్రీమా, లేక నాన్-డెయిరీ క్రీమా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపించినా, రుచి, టెక్స్చర్, తయారీ విధానం పరంగా ఇవి పూర్తిగా భిన్నమని ఫుడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ బేకరీల్లో ఎక్కువగా ఉపయోగించే నాన్-డెయిరీ క్రీమ్ గురించి తెలుసుకోవడం వినియోగదారులకు ఉపయోగకరమని సూచిస్తున్నారు. సాధారణంగా విప్డ్ డెయిరీ క్రీమ్ ఆవు పాలతో తయారవుతుంది. ఇందులో కనీసం 30 శాతం వరకు పాల కొవ్వు ఉంటుంది. ఈ ఫ్యాట్ కారణంగానే క్రీమ్‌కు మృదువైన టెక్స్చర్, క్రీమీ ఫీలింగ్ వస్తాయి. విప్ చేసినప్పుడు గాలిని పట్టుకుని లైట్‌గా, ఫ్లఫీగా మారుతుంది. బ్రాండెడ్ బేకరీల్లో కనిపించే సాఫ్ట్ క్రీమ్ కేక్‌లలో సాధారణంగా ఇలాంటి డెయిరీ క్రీమ్ ఉపయోగిస్తారు.
మరోవైపు నాన్-డెయిరీ క్రీమ్ పూర్తిగా వేరే ఉత్పత్తి. ఇది సాధారణంగా నీరు, హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్, కార్న్ సిరప్, స్టెబిలైజర్స్, ఎమల్సిఫైయర్స్ వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇది డెయిరీ క్రీమ్‌లా కనిపించేందుకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే ఇది సహజ పాల ఉత్పత్తి కాదని నిపుణులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కువ బేకరీలు నాన్-డెయిరీ క్రీమ్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణం వాతావరణమే. అధిక ఉష్ణోగ్రతల్లో డెయిరీ క్రీమ్ త్వరగా కరుగుతుంది. కానీ నాన్-డెయిరీ క్రీమ్ ఎక్కువసేపు ఆకారాన్ని నిలుపుకుంటుంది. కేక్ డెకరేషన్స్, డిజైన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. డెలివరీ సమయంలో కూడా ఇది సులభంగా చెడిపోదు. కేక్‌పై ఉన్న క్రీమ్ ఏ రకమో కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని చెబుతున్నారు. డెయిరీ క్రీమ్ సాధారణంగా తేలికగా, మైల్డ్ స్వీట్‌గా ఉంటుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతూ పాల రుచిని ఇస్తుంది. తిన్న తర్వాత ఆయిలీ ఫీలింగ్ ఉండదు. అదే నాన్-డెయిరీ క్రీమ్ అయితే ఎక్కువ తీపిగా ఉండటంతోపాటు కొంచెం ఆర్టిఫిషియల్ రుచి వస్తుంది. కొందరికి ఇది మైనం లాంటి లేదా ఆయిలీ ఫీలింగ్ ఇస్తుంది. తిన్న తర్వాత నాలుకపై కొద్దిసేపు కొవ్వు పొర ఉన్నట్టుగా అనిపిస్తుంది.
క్రీమ్ రూపాన్ని చూసి కూడా కొంతవరకు అంచనా వేయొచ్చని చెబుతున్నారు. డెయిరీ క్రీమ్ కొంచెం మ్యాట్ ఫినిష్‌లో కనిపిస్తుంది. పైపింగ్ డిజైన్లు సాఫ్ట్‌గా ఉంటాయి. నాన్-డెయిరీ క్రీమ్ మాత్రం ఎక్కువ గ్లోసీగా, ప్లాస్టిక్ లుక్‌తో కనిపిస్తుంది. కేక్‌పై డిజైన్లు కూడా చాలా షార్ప్‌గా, గట్టిగా కనిపిస్తాయి. చేతికి తగిలినప్పుడు కూడా తేడా తెలుస్తుంది. డెయిరీ క్రీమ్ శరీర వేడితో త్వరగా కరుగుతుంది. నాన్-డెయిరీ క్రీమ్ మాత్రం కొంత గట్టిగా, మైనంలా ఉండి త్వరగా కరగదు. ప్యాకేజ్డ్ కేక్‌లలో అయితే ఇన్‌గ్రిడియెంట్స్ లిస్ట్ చూసి తెలుసుకోవచ్చు. క్రీమ్, డెయిరీ క్రీమ్ వంటి పదాలు ఉంటే అది పాల ఆధారిత క్రీమ్ అయ్యే అవకాశం ఉంది. వెజిటబుల్ ఫ్యాట్, నాన్-డెయిరీ టాపింగ్, పామ్ ఆయిల్, స్టెబిలైజర్స్ వంటి పదాలు ఉంటే అది నాన్-డెయిరీ క్రీమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ పూర్తిగా చెడు కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డెయిరీ క్రీమ్ సహజమైన రుచి ఇస్తే, నాన్-డెయిరీ క్రీమ్ ఎక్కువ స్థిరత్వం కలిగి ఉంటుంది. ముఖ్యంగా లాక్టోజ్ అసహనం ఉన్నవారికి లేదా వెగన్ ఆహారం తీసుకునేవారికి నాన్-డెయిరీ క్రీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. కేక్ కొనేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ అంటే నిజంగా ఏ క్రీమ్ వాడుతున్నారో బేకరీని నేరుగా అడగడం మంచిది. రుచి, టెక్స్చర్, రూపం, లేబుల్ వంటి విషయాలను గమనిస్తే డెయిరీ, నాన్-డెయిరీ క్రీమ్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.