నల్ల మిరియాలు.. సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పేరొందాయి. ఒకప్పుడు భారత దేశానికే పరిమితమైన ఈ మసాలా దినుసు దీనిలోని ఔషధ గుణాలు, ఘాటు రుచివల్ల ప్రపంచవ్యాప్తమైంది. మిరియాలకు పుట్టిల్లు మనదేశంలో మలబార్ ప్రాంతం. ప్రస్తుతం వియత్నాంలో నల్ల మిరియాలు ఎక్కువగా పండుతున్నాయి. ఆహారాల్లో రుచిని పెంచేందుకు మిరియాలను వాడతారు. వీటిని ఔషధంగా ఎక్కువగా వాడుతారు. వీటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
1. అధిక బరువును తగ్గిస్తుంది..
బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకోవాలి. ఇది రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి అత్యుత్తమ పోషకాలను సంగ్రహిస్తుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు మన శరీరంలోని హానికరమైన టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రోజూ ఆహారంలో చిటికెడు నల్ల మిరియాల పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి.
2. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం..
ప్రతి వాతావరణ మార్పు జలుబు, దగ్గు వైరస్‌లను వెంట తెచ్చి, పిల్లలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది, అయితే కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు నల్ల మిరియాలను తేనెతో కలిపి ఉపయోగించాలి. మిరియాలలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాక్టీరియా, ఫ్లూ లక్షణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
3. క్యాన్సర్‌ను నివారిస్తుంది..
నల్ల మిరియాలలో పైపెరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో, క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో సహాయపడుతుంది. అలాగే, నల్ల మిరియాలలో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
4. జీర్ణక్రియకు సహాయపడుతుంది..
అజీర్ణం లేదా మలబద్ధకంతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను తప్పకుండా చేర్చుకోవాలి. తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకుగానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేసే జీర్ణ రసాలను ఉత్తేజపరిచేందుకు, నియంత్రించడంలో నల్ల మిరియాలు తోడ్పడతాయి.
5. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
నల్ల మిరియాల చూర్ణం ఉత్తమ స్కిన్ ఎక్స్ఫోలియెంట్లలో ఒకటి. నల్ల మిరియాలను పొడిచేసి పెరుగు, తేనెతో కలిపి చర్మానికి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. విటిలిగో (బొల్లి)ను నయం చేయడంలోనూ నల్ల మిరియాలు సహాయపడుతాయి.