Hair Fall | ఈ మధ్య ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య హెయిర్‌ఫాల్. వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఆహారపు అలవాట్ల ప్రభావంతో జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, జుట్టు పలచబడటం వంటి సమస్యలను మహిళలు, పురుషులు అందర్నీ వేధిస్తున్నాయి. దీనివల్ల బట్టతల వస్తుందేమోనని చాలామంది భయపడిపోతుంటారు. అయితే, ఇలాంటి సమస్యలకు మునగాకు నూనె (Moringa Oil) అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మునగ నూనెలో విటమిన్ A, B, C, Eతో పాటు కాల్షియం, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి.
కొద్దిగా గోరువెచ్చగా కాచిన మునగాకు నూనెను తలపై పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కుదుళ్లకు కావాల్సినంత పోషకాలు అందుతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి కొత్త వెంట్రుకలు పెరగడానికి దోహదపడుతుంది. అలాగే తల చర్మం పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది.
మునగాకు నూనెలో కొద్దిగా పెరుగు, తేనె కలిపి హెయిర్ మాస్క్‌ను తయారుచేసుకోవచ్చు. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. పొడిబారిన వెంట్రుకలకు ఇది సహజసిద్దమైన కండీషనర్‌లా పనిచేస్తుంది.
జుట్టు రాలడంతో పాటు వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు మునగాకు నూనెను కొబ్బరి నూనెతో కలిపి జుట్టు చివర్లకు రాయాలి. ఇది వెంట్రుకలు దెబ్బతిన్న భాగాలను రిపేర్ చేసి, విరిగిపోకుండా రక్షిస్తాయి.
మునగాకు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చుండ్రును తగ్గించడంలో ఉపయోగపడతాయి. కొద్దిగా నిమ్మ రసం లేదా టీ ట్రీ ఆయిల్‌తో కలిపి తలకు పట్టిస్తే తల చర్మం శుభ్రంగా ఉండటంతో పాటు చుండ్రు సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
తలస్నానం చేసిన తర్వాత జుట్టు చివరలకు కొద్దిగా మునగాకు నూనె రాసుకోవాలి. ఇది సహజసిద్ధమైన హెయిర్ సీరమ్‌లా పనిచేస్తుంది. జుట్టులోని ఫ్రిజినెస్ను తగ్గించి, వెంట్రుకలకు మెరుపు అందిస్తుంది.
జుట్టుకు లోతైన పోషణ అందాలంటే పడుకునే ముందు మునగాకు నూనెను తలకు, వెంట్రుకలకు రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టును బలంగా, ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది.
మునగాకు నూనెను ఆముదం నూనె, కొబ్బరి నూనె లేదా ఉసిరి నూనెతో కలిపి వాడితే మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది.