GLP-1 Medicine | బరువు తగ్గించే మందుల వాడకం నేటి కాలంలో ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే ఈ మందులు కేవలం బరువును తగ్గించడానికే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచగలవని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సెమాగ్లూటైడ్ వంటి ఔషధాలు హార్ట్ అటాక్ తర్వాత వచ్చే తీవ్రమైన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని యూకేలో జరిగిన అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనలో GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్స్ అనే ఔషధాల వర్గంపై దృష్టి సారించారు. వీటిని సాధారణంగా టైప్-2 డయాబెటిస్, స్థూలకాయం చికిత్సలో ఉపయోగిస్తారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సహజ హార్మోన్లను అనుకరించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. గతంలోనే ఈ ఔషధాలు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనాలు సూచించాయి.
తాజాగా బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన ప్రయోజనాన్ని గుర్తించారు. హార్ట్ అటాక్ తర్వాత గుండెకు రక్తప్రసరణను సూక్ష్మ స్థాయిలో మెరుగుపరచడం ద్వారా గుండె పునరుద్ధరణకు ఈ మందులు సహాయపడతాయని వారు తెలిపారు. ఈ ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధనలో నో-రీఫ్లో అనే ప్రమాదకర పరిస్థితిపై దృష్టి సారించారు. హార్ట్ అటాక్ సమయంలో ప్రధాన రక్తనాళం తెరిచిన తర్వాత కూడా చిన్న రక్తనాళాలు బ్లాక్ అయ్యే పరిస్థితినే నో-రీఫ్లో అంటారు. ఇది సుమారు 50 శాతం రోగుల్లో కనిపిస్తుందని, తద్వారా ఒక సంవత్సరంలో మరణం లేదా హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. GLP-1 ఔషధాలు ఈ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్ట్ అటాక్ సమయంలో పెరిసైట్స్ అనే సూక్ష్మ కణాలు రక్తనాళాలను సంకోచింపజేస్తాయి. దీని వల్ల గుండె కణజాలానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అయితే ఈ మందులు పొటాషియం ఛానల్స్‌ను యాక్టివేట్ చేసి, ఈ కణాలను రిలాక్స్ చేయడంతో రక్తనాళాలు విస్తరించి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె కణజాలానికి ఆక్సిజన్ సరఫరాను పెంచి, మరింత నష్టం జరగకుండా కాపాడే అవకాశముంటుంది. అంటే, ఈ మందులు కేవలం బరువు తగ్గించడమే కాకుండా, గుండెపోటు తర్వాత ప్రాణాపాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయని స్పష్టమైంది.
భవిష్యత్తులో ఈ మందులను అత్యవసర వైద్యంలో కూడా ఉపయోగించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే పారామెడిక్స్ ఈ మందులను ఇవ్వడం లేదా రక్తనాళాలను తెరిచే చికిత్స సమయంలో ఉపయోగించడం వంటి మార్గాలు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఫలితాలు ప్రస్తుతం జంతువులపై చేసిన అధ్యయనాల ఆధారంగా మాత్రమే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే వరకు ఈ మందులను హార్ట్ అటాక్ చికిత్సలో సాధారణంగా ఉపయోగించలేమని స్పష్టం చేస్తున్నారు. రోగులు వైద్యుల సలహా లేకుండా ఈ మందులను వినియోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం ఇంకా అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటున్నారు. సెమాగ్లూటైడ్ వంటి వెయిట్ లాస్ మందులు గుండెపోటు తర్వాత వచ్చే ప్రమాదాలను తగ్గించగలవని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే, ఇవి సాధారణ చికిత్సగా మారడానికి ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.