వయసుతో వచ్చే ఎన్నో సమస్యల్లో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు బాగా వేధిస్తుంటాయి. భరించలేని ఈ నొప్పులు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. శరీరంలోని అధికవేడి ఇందుకు ముఖ్య కారణం. రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వేడి, కీళ్ల వాపు, నొప్పులు తగ్గుతాయి.
పచ్చి బొప్పాయి: సాధారణంగానే పచ్చి బొప్పాయిలో పపెయిన్ అనే యాంటి ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఉంటుంది. అది కీళ్ల నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్లు పచ్చి బొప్పాయిని తరచూ తీసుకోవాలి. పరగడుపున బొప్పాయి పండును తీసుకున్నా ఉపశమనం లభిస్తుంది.
తెల్ల నువ్వులు: ఇందలోని క్యాల్షియం, కాపర్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఎక్కువ క్యాల్షియాన్ని అందించడంలో తెల్ల నువ్వులు ముందు వరుసలో ఉంటాయి.
మునగ: ఇందులోని క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే మునగలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్, గాయపడిన ఎముకల చికిత్సలో తోడ్పడతాయి.
నానబెట్టిన అంజీరా: ఎండిన అంజీరాల్లో ఫైటోకెమికల్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి అప్పటికే ఇబ్బంది పెడుతున్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించి, కొత్త సమస్య రాకుండా చేస్తాయి. అయితే, ఎండిన అంజీరా కాకుండా వాటిని నానబెట్టి తింటే ఆరోగ్యానికి మంచిది.
చియా గింజలు: ఈ గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లు ఈ గింజలను రోజూ నీళ్లలో నానబెట్టుకుని తాగాలి.
మెంతులు: వీటిలోని లినోలెనిక్, లినోలిక్ ఆమ్లాలు కీళ్లనొప్పిని తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ మెంతులను కప్పు నీళ్లలో బాగా మరిగించి, వడగట్టిన తర్వాత ఆ నీళ్లను తాగితే మంచి గుణం కనిపిస్తుంది.