పెద్దపేగు లేదా పురీషనాళంలో వచ్చే క్యాన్సర్‌ను పెద్దపేగు క్యాన్సర్ లేదా కోలోన్ క్యాన్సర్ అంటారు. ఇది మొదట సాధారణంగా పెద్దపేగు లోపలిభాగంలో అసాధారణ కణాలు, పాలిప్ గడ్డలుగా ఏర్పడతాయి. 10-15 ఏళ్ల తర్వాత ఈ కణాలు వాటి సెల్యులార్ డీఎన్ఏలో శ్రేణులుగా ఉత్పరివర్తనం చెందుతాయి. ఈ పాలిప్స్.. డీఎన్ఏను మార్చుకున్నప్పుడు అది పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీస్తుంది.
అసాధారణమైన లేదా అనారోగ్య కణాల శ్రేణి పెరగడం, భారీ సంఖ్యలో విస్తరించడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఇది కణితులు ఏర్పడేందుకు దారితీస్తుంది. ఈ కణాలు ఇతర ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్‌కు కారణమయ్యే లేదా పెంచే ప్రత్యేక కారకాలు ఏవీ లేవు. కానీ ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..
1. ఇన్ఫ్లమేటరీ ఇంటెస్టినల్ కండిషన్స్..
పేగు సంబంధిత వ్యాధుల వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటంది. అల్సరేటివ్ కొలైటిస్లాంటి పేగు సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ.
2. వంశపారంపర్య జబ్బు..
పెద్దపేగు క్యాన్సర్ అనేది వంశపారంపర్య జబ్బు. కుటుంబంలో ఎవరికైనా పేగు క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉంటే కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలి. తరుచూ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.
3. ధూమపానం
ధూమపానం పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక వీలైనంత తొందరగా ఆ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
4. ఆల్కహాల్..
అతిగా మద్యం సేవించడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక మద్యం మానేయడం ఉత్తమం.
5. తక్కువ ఫైబర్, అధిక కొవ్వుగల ఆహారం..
అధిక కొవ్వు, కేలరీలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం పెద్దపేగు క్యాన్సర్, మల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాలు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తుల్లో పెద్దపేగు కాన్సర్ ప్రమాదాన్ని కనుగొన్నాయి.
6. వృద్ధాప్యం
పెద్ద పేగు క్యాన్సర్ ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే, 50 కంటే ఎక్కువ వయస్సు ఉండే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
7. ఆఫ్రికన్-అమెరికన్ జాతి..
ఇతర జాతుల ప్రజల కంటే ఆఫ్రికన్-అమెరికన్ మూలానికి చెందిన వ్యక్తులకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.