Salt | చాలా మంది చేసే వంటలకు ప్రత్యేక రుచిని తీసుకురావడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. వంటలు రుచిగా ఉండాలంటే ఉప్పు వేయాల్సిందే. అయితే రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. కానీ అధిక సోడియం తీసుకోవడం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే తీసుకునే సోడియంలో 70 శాతానికి పైగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ ఆహారాల నుంచే వస్తోంది. ఇవి రుచికి ఉప్పుగా అనిపించకపోయినా, లోపల సోడియం మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అధిక సోడియం వినియోగం కేవలం రక్తపోటు పెరగడానికే కాదు, గుండె వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఎముకల బలహీనత, మెదడు సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలోని ద్రవ సమతౌల్యాన్ని దెబ్బతీసి, గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీర్ఘకాలంలో రక్తనాళాలు కఠినంగా మారి, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు సోడియం అధికంగా ఉండే ప్రధాన వనరులు. ఫ్రోజన్ మీల్స్, కాన్డ్ సూప్స్, లంచ్ మీట్స్ వంటి వాటిలో నిల్వ ఉంచడానికి, రుచి కోసం ఎక్కువ ఉప్పు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇన్స్టంట్ ఓట్స్, సిరియల్స్ వంటి తీపి పదార్థాల్లో కూడా ప్రిజర్వేటివ్‌గా ఉప్పు వాడటం సాధారణంగా మారింది. కండిమెంట్స్, సాస్‌లు కూడా సోడియం పెంచే అంశాల్లో ముందుంటాయి. కెచప్, సోయా సాస్, సలాడ్ డ్రెస్సింగ్స్, మారినేడ్స్ వంటి వాటిని ఎక్కువగా వాడటం ద్వారా రోజువారీ సోడియం మోతాదు తెలియకుండానే పెరుగుతుంది. అలాగే స్నాక్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిప్స్, నమకీన్, భుజియా, సాల్టెడ్ నట్స్ వంటి వాటిని తరచూ తీసుకుంటే సోడియం స్థాయి త్వరగా పెరుగుతుంది. అలాగే బ్రెడ్, బేకరీ ఉత్పత్తుల్లో కూడా ఉప్పు ఉండటం వల్ల అవి కూడా సోడియం వనరులుగా మారుతున్నాయి.
చీజ్, పచ్చళ్ళు (పికిల్స్) కూడా అధిక సోడియం కలిగిన ఆహారాలు. ముఖ్యంగా ఒక స్పూన్ నిల్వ పచ్చడిలో 300 నుంచి 600 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉంటుంది. ప్యాకేజ్డ్ పనీర్‌లో కూడా నిల్వ కోసం ఉప్పు కలుపుతారు. కనుక ఈ ఆహారాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక సోడియం వినియోగాన్ని నియంత్రించడానికి కొన్ని సాధారణ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలపై ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్‌ను తప్పనిసరిగా చదవాలి. తక్కువ సోడియం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. ఇంట్లో వంట చేసుకోవడం ద్వారా ఉప్పు పరిమాణాన్ని నియంత్రించవచ్చు. రుచి కోసం తాజా కూరగాయలు, మసాలాలు ఉపయోగించడం మంచిది. సోడియం వినియోగంపై అవగాహన పెంచుకుని, జాగ్రత్తగా ఆహారం ఎంచుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. చాలా మంది చేసే ఈ చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.