Diabetes and Oranges | డయాబెటిస్తో బాధపడుతున్నవారు నారింజ పండ్లు తినడం సురక్షితం.. అని చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే మధుమేహులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం, సూచించిన మందులు వాడుతుండటం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉత్తమ పద్ధతులు. మధుమేహం ఉన్నవారు సహజ చక్కెరలను కలిగి ఉన్న నారింజ పండ్లను తినకూడదనే అపోహ సర్వత్రా ఉన్నది. అయితే, వాస్తవానికి నారింజ పండ్లను మితంగా తీసుకున్నట్లయితే మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో ఆరోగ్యకరమైన భాగం అవుతుంది.
లో గ్లైసెమిక్ ఇండెక్స్..
ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా ప్రభావితం చేస్తుందో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా కొలుస్తారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తినడం ద్వారా బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది. నారింజ పండు తక్కువ జీఐని కలిగి ఉండి డయాబెటిక్ రోగులకు పాజిటివ్‌గా ఉంటుంది. నారింజ పండ్లను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. అలాగే, ఇది నిరంతర శక్తిని అందిస్తుంది.
నారింజ ఎందుకు ఆరోగ్యకరం..?
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, సిట్రస్ పండ్లను మధుమేహ రోగులకు సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. నారింజలో ఫైబర్, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహులకు ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనం చేకూరుస్తుంది. నారింజలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఇది జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
పండు తినాలా..? జ్యూస్ తాగాలా..?
నారింజ రసం తాగడం కంటే నారింజ పండు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా రసాలలో తగినంత పీచు పదార్థాలు ఉండవు. అందుకని రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. జర్నల్ డయాబెటిస్ కేర్ ప్రకారం, సిట్రస్ పండ్లు తినడం వల్ల మహిళల్లో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే పండ్ల రసం తాగడం మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తియ్యని ఆరెంజ్ జ్యూస్ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ కూడా దాదాపు 50. ఇది మొత్తం నారింజ జీఐ స్కోర్‌తో పోలిస్తే 40గా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు..
నారింజలో ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్సులిన్ నిరోధకత, ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. నారింజలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, వాపులతో పోరాడతాయి.