Cancer | క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఏటా లక్షలమంది మరణిస్తున్నారు. శరీరంలో.. అసాధారణ కణాలు అదుపులేకుండా పెరగడమే క్యాన్సర్. ఈ మహమ్మారి విజృంభణకు ఎన్నో కారణాలు. కానీ, మనిషిని చుట్టుముట్టే దురలవాట్లే అతడిని క్యాన్సర్ రుగ్మతకు దగ్గర చేస్తాయి. పొగ, మితిమీరిన మద్యం, పోషకాల్లేని ఆహారం, శారీరక శ్రమ తగ్గిపోవడం.. ఇలా ఎన్నో శత్రువులు. నిజానికి క్యాన్సర్ వయసు, లింగం, జీవనశైలితో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఉత్తమమైన జీవనశైలితో దాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. త్వరగా తరిమికొట్టొచ్చు.
సిగరెట్‌కు ఒక వైపు నిప్పు, మరోవైపు ముప్పు ఉంటాయంటారు. క్యాన్సర్ ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. ఇది ఓ పట్టాన వదిలించుకోలేని దురలవాటు. 85 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ల విషయంలో ధూమపానమే ప్రధాన ముద్దాయి. ఒక్క ఊపిరితిత్తులే అని కాదు.. గొంతు, నోరు, అన్నవాహిక, మూత్రాశయం, మూత్రపిండాలు, పాంక్రియాస్, పొట్ట క్యాన్సర్లకు కూడా పొగ అలవాటుతో లంకె ఉంటుంది. సిగరెట్‌లోని టార్, నికోటిన్, కార్బన్ మోనాక్సయిడ్, ఇతర క్యాన్సర్ కారకాలు అతి హానికరమైన రసాయనాలు. ఇవి మన డీఎన్ఏలోని కణాలను కూడా ధ్వంసం చేసేస్తాయి. క్యాన్సర్ కణాలు అంతులేకుండా పెరిగిపోవడానికి దోహదపడతాయి. పొగతాగని వారికంటే, తాగేవారిలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 15 శాతం ఎక్కువని వివిధ అధ్యయనాల్లో తేలింది.
మితిమీరిన మద్యపానం క్యాన్సర్‌కు కారణమవుతుంది. హద్దులు దాటే వ్యసనం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కాలేయం, పేగులు, రొమ్ము క్యాన్సర్ వృద్ధి చెందే ఆస్కారం ఉంది. మద్యపాన దురలవాటు కణాలు, కణజాలం మీద దుష్ప్రభావం చూపుతుంది. శరీరంలో క్యాన్సర్ కారకాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు, అత్యవసర పోషకాలను హరాయించుకునే సామర్థ్యాన్నీ దెబ్బతీస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంలో, క్యాన్సర్ నియంత్రణలో పోషకాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ ముప్పునకు పోషకాలు లేని ఆహారం కూడా ఓ కారణమే. ప్రాసెస్ చేసిన చిరుతిళ్లు, రెడ్ మీట్, శుద్ధిచేసిన చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండిన పదార్థాలు ఆరోగ్యానికి తీవ్ర హానిచేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, సిరి ధాన్యాలకు ఎంత దూరమైతే క్యాన్సర్‌కు అంత దగ్గరైనట్టు. పేగులు, పొట్ట, ప్రొస్టేట్ క్యాన్సర్లకు కూడా పోషక విలువల్లేని ఆహారమే మూలం. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ లోపించిన తిండి.. శరీరంలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే వ్యవస్థలను బలహీనపరుస్తుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తిని పెంచుతుంది. పైగా వ్యాయామం, శారీరక శ్రమ లేకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటే ఊబకాయం దాపురిస్తుంది. రొమ్ము, పేగులు, పాంక్రియాటిక్ క్యాన్సర్లకు, ఊబకాయానికి దగ్గర సంబంధం ఉంది.
తగినంత శారీరక శ్రమ లేకపోవడమూ పెద్ద అనర్థమే. కదలికలు లేని జీవనశైలి ఊబకాయాన్ని, దాంతోపాటు క్యాన్సర్ ముప్పునూ పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకత, రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యానికి దారితీస్తుంది. కాబట్టి, క్రమం తప్పకుండా కసరత్తు చేయాలి. శారీరక శ్రమ రొమ్ము, పేగులు, ఎండోమెట్రియల్ (గర్భాశయ) క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. శరీరంలో హార్మోన్లను సమతూకంలో ఉంచుతుంది. మొత్తంమీద మన దురలవాట్లే మనలో క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.
కాబట్టి, క్యాన్సర్ లక్షణాల పట్ల అవగాహన పెంచుకుని.. తొలిదశలోనే రుగ్మతను గుర్తించి మంచి చికిత్స తీసుకోవాలి. కొన్నిసార్లు ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి కావచ్చు అయినా సరే.. జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. మన ఆరోగ్యం గురించి ఎరుకతో ఉండాలి. అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోవాలి. క్యాన్సర్‌తో పోరాటానికి రెండే మార్గాలు. ఒకటి, వ్యాధిని
తొలిదశలోనే గుర్తించడం. రెండు, గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం. ‘క్యాన్సర్ డే’ నేపథ్యంలో అయినా ఆ మేరకు ఓ నిర్ణయం తీసుకుందాం.
1 ధూమపానం
మితిమీరిన మద్యపానం, పోషకాల్లేని ఆహారం, శారీరక శ్రమ తగ్గిపోవడం.. ఇవన్నీ శరీరంలో కణాలను, కణజాలాన్ని ధ్వంసం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ రాజీపడేలా వ్యవహరిస్తాయి. క్యాన్సర్ కణాల వ్యాప్తికి దోహదపడతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలితో వ్యాధుల ముప్పును వీలైనంతవరకు తగ్గించుకోవాలి. అయితే, తొలిదశలోనే గుర్తిస్తే కనుక క్యాన్సర్ వ్యాధి సులభంగా చికిత్సకు లొంగిపోతుంది. అందుకే క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకుని ఉండాలి. క్యాన్సర్ ముప్పును గుర్తించడంలో ఈ పదీ ప్రధాన హెచ్చరికలు.
2 బరువు
తగ్గడం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే శరీర బరువు ఐదు కిలోల వరకు తగ్గారంటే అది… పాంక్రియాస్, పొట్ట, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వివిధ రకాలైన క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడానికి వేరే కారణాలూ ఉండొచ్చు.
3 తీవ్రమైన అలసట
ఎంత విశ్రాంతి తీసుకున్నా.. రోజంతా అలసట పీడిస్తూ ఉన్నదంటే క్యాన్సర్ లక్షణమే కావచ్చు. కాబట్టి నిస్సత్తువగా అనిపిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
4 పేగుల పనితీరు
డయేరియా (అతిసారం), మలబద్ధకం, మూత్రం, మలంలో రక్తం, తరచుగా మూత్రానికి వెళ్లడం లాంటివి పేగులు, మూత్రాశయం,ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సంకేతాలు.
5 దీర్ఘకాలిక నొప్పి
కొన్ని వారాలపాటు శరీరంలో ఎడతెగని నొప్పి ఉందంటే.. ఎముకలు, అండాశయం, మూత్రాశయం లాంటి క్యాన్సర్లకు హెచ్చరిక అనుకోవాలి. అసాధారణమైన నొప్పి బాధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు.
6 చర్మంలో మార్పులు
చర్మం పరిమాణంలో, రూపంలో తేడా రావడం, హఠాత్తుగా పుట్టుమచ్చల్లాంటివి ఏర్పడటం తదితర మార్పులు కనిపించినా, చర్మంపై గాయాల్లా
అనిపించినా అస్సలు విస్మరించకూడదు. అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు.
7 ఎడతెగని దగ్గు
విడువకుండా దగ్గు రావడం, ముఖ్యంగా దగ్గుతోపాటు రక్తం పడితే గనుక దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు హెచ్చరికగా భావించాలి. మింగడంలో ఇబ్బంది ఆహారం మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటే దాన్ని అన్నవాహిక లేదా గొంతు క్యాన్సర్ సూచనగా పరిగణించాలి. మింగే సమయంలో గొంతులో ఏదైనా అడ్డుపడుతున్నట్టు అనిపిస్తే స్పష్టత కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
8 రొమ్ములో మార్పులు
రొమ్ము పరిమాణం, రూపం, అమరికలో ఏవైనా మార్పులు తలెత్తడం, గడ్డలు, గట్టిపడటం లాంటివన్నీ రొమ్ము క్యాన్సర్ సూచనలు. అందులోనూ స్త్రీలు. క్రమం తప్పకుండా రొమ్మును పరీక్షించుకోవాలి. ఏ చిన్న మార్పులు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి.
9 అజీర్తి
ఎప్పుడూ అజీర్ణ సమస్య వేధిస్తుండటం, తినడంలో ఇబ్బంది ఉంటే.. పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌గా అనుమానించాలి. స్త్రీలలో అయితే అండాశయ క్యాన్సర్‌కు సంకేతంగా గుర్తించాలి. సాధారణ మందులతో తగ్గకపోతే నిపుణులను సంప్రదించాలి.
10 అకారణ రక్తస్రావం
స్త్రీలలో నెలసరి మధ్యలో, మెనోపాజ్ తర్వాత.. మూత్రంలో, మలంలో రక్తం పడుతుంటే మాత్రం, దాన్ని వివిధ క్యాన్సర్లకు హెచ్చరికగా భావించాలి. వీటిలో గర్భాశయ, మూత్రాశయ, పేగులకు సంబంధించిన క్యాన్సర్లు ప్రధానమైనవి.
– డాక్టర్ నిఖిల్
ఎస్ ఘడ్యాల్ పాటిల్
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్