‘నా మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నది. రోజు రోజుకూ ఏకాగ్రత తగ్గిపోతున్నది’ అంటూ మన సమస్యను చెప్పగానే డాక్టరు గబగబా ప్రిస్క్రిప్షన్ పేపర్మీద ‘రోజూ కాసేపు అలా బయట తిరిగిరండి’ అని రాస్తారేమో ఇకముందు! జర్మనీలో జరిగిన పరిశోధన గురించి వింటే, ఇదంతా సాధ్యమే అనిపిస్తుంది. మనం కాసేపు అలా ఆరుబయట తిరగడం వల్ల మెదడుమీద సానుకూల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన విశ్లేషణ, ఉద్వేగాలు, చర్యలను నియంత్రించే మెదడులోని కీలక భాగాలు బలపడటాన్ని వారు గమనించారు. ఆరునెలల పాటు ఆరుగురు నడివయసు వ్యక్తుల జీవితాలను క్షుణ్నంగా పరిశీలించి, వారి మెదడుకు సంబంధించిన 280 ఎమ్ఆర్ఐ స్కాన్లను విశ్లేషించిన తరువాత.. తేల్చిన విషయమిది. మరెందుకు ఆలస్యం? సరదాగా నాలుగు అడుగులు వేయండి మరి!