ప్రవాసం అంటే మనం నివసిస్తున్న భౌగోళిక ప్రాంతానికి దూరంగా కొత్త ప్రదేశంలో, కొత్త వాతావరణ పరిస్థితుల్లో, కొత్త ఆహారపు అలవాట్లతో, కొత్త వేషభాషలు మనవి కాని ఆచారసంప్రదాయాలున్నమనుషుల మధ్య జీవించడం. అన్నిటికన్నా కష్టమైనది ఆత్మీయానురాగాల్ని పంచుతూ ఆపదల్లో, అవసరాల్లో దగ్గరుండే అనుబంధాలకు దూరమవ్వడం.
ప్రపంచమే కుగ్రామం అయిన నేటిరోజుల్లో, ఇప్పుడున్న శాస్త్రసాంకేతిక సమాచార విప్లవ యుగంలో…మీట నొక్కితే చాలు ఆత్మీయులతో గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుకోవచ్చు, వీడియో చాట్ చేసుకోవచ్చు, అవసరమైనవి అట్టే తెప్పించుకోవచ్చు. ఇంత సౌలభ్యం, సౌకర్యామూ ఉన్నా ప్రవాసం ప్రవాసమే. ఏదో వెలితి ఉండనే ఉంటుంది. ఇప్పటి పరిస్థితే ఇలా ఉంటే మరి 60 సంవత్సరాల క్రితం ఏ రకమైన ముందస్తు సమాచారం, సదుపాయాలు లేకుండా ఒక కొత్త దేశం వెళ్ళి అక్కడి స్థితిగతులకు తలొగ్గి జీవితాన్ని నెట్టుకురావడం ఎలా ఉంటుందో ఆలోచించండి. వారి మానసిక స్థితి, రోజువారీ జీవనవిధానం ఎంతటి కష్టతరంగా సాగిఊంటుందో ఊహించండి. ఆ గాథలు వింటుంటే ఇప్పటి తరానికి పాతకాలపు ఫాంటసీ సినిమాలా గోచరించవచ్చు. జీవితం ఈ రకంగా కూడా ఉండి ఉంటుందా అని ఆశ్చర్యపోవచ్చు.
60 ఏళ్ళ కిందట తెలుగువారు మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకి ప్రవాసబాట పట్టారు. అంచెలంచెలుగా ఎదిగి నేడు తెలుగువారి అస్తిత్వపతాకను ఆస్ట్రేలియా వినువీధుల్లో సగర్వంగా ఎగరవేస్తున్నారు. విజయగీతికలను వీనులవిందుగా వినిపిస్తున్నారు. వీటన్నిటి వెనక ఉత్తానపతనాలతో కూడిన 60 ఏళ్ళ సుదీర్ఘప్రయాణముంది. పరిణామముంది. ఆ ప్రయాణపు పరిణామశీలత నుంచి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఎంతగానో నేర్చుకోవచ్చు.
మరి ఆ ఆరు దశాబ్దాల ప్రస్థానాన్ని, విశేషాలను భద్రపరిస్తే తప్ప భావితరం తెలుసుకోలేదు. అలా భద్రపరిచే భారీ బాధ్యతను కొంచాడ మల్లికార్జునరావు ఒక్కడే తలకెత్తుకున్నాడు. ఎన్నో మైళ్ళు ప్రయాణించాడు. ఎందరినో ఇంటర్వ్యూ చేశాడు. వీలైనంత మందితో వ్యాసాలు రాయించాడు. మొత్తానికి విలువైన సమాచారాన్ని సేకరించాడు. అంతటితో ఆగకుండా అందమైన గ్రంథంగా మలిచాడు. ఈ గ్రంథం చదివితే ఆస్ట్రేలియాలో 60 ఏళ్ళుగా తెలుగువారి మారుతున్న మానసిక స్థితిగతుల్ని అధ్యయనం చేయవచ్చు, మారుతున్న కాలమాన స్థితిగతుల్ని తెలుసుకోవచ్చు, తెలుగువారు ఎదిగి గెలిచిన తీరుకు మురిసిపోవచ్చు, అస్తిత్వమూలాల్ని కాపాడుకున్న వైనాన్ని మెచ్చుకోవచ్చు.
అంతేకాదు, ఈ గ్రంథం చాలా దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగువారికి కరదీపికలా ఉపయోగపడుతుంది. తద్వారా వారు కూడా తమ గతాన్ని రికార్డు చేయడానికి స్ఫూర్తికారకమవుతుంది.
ఎంతో శ్రమకోర్చి ఇంతటి బృహత్కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన కొంచాడ మల్లికార్జునరావుకి హృదయపూర్వక అభినందనలు.
ఐతే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా విషయాలు రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అడుగుజాడల్లో మిగతావారు ఆ కార్యాన్ని ముందుకు నడిపించాలి.
మరొక్కమారు కొంచాడ మల్లికార్జునరావు గారికి హార్దికాభినందనలతో….
~ రాపోలు సీతారామరాజు,
దక్షిణాఫ్రికా