ఆచ్ఛిక సమాసాల్లో వర్ణలోపాగమా దేశాదులు. బహుళంగా కనిపిస్తున్నాయంటూ సూత్రం చెప్పి- ఇరు +పంది – ఇబ్బంది – ఉద్ద+ దరి – ఉద్దరి – ఎడమ + వంక – ఎడవంక – వలమ + వంక – వలవంక ఎగువ + దల- ఎగుదల – దిగువ + దల – దిగుదల చిత్తరువు + బొమ్మ-చిత్తరుబొమ్మ- తెగువ+దారి – తెగువారి – దొంతి+తరగ – దొంతరగ – పసిమి + పట్టు- పసి పట్టు – బాపు+ పురె-బాపురె-పెద్ద + పులి – బెబ్బులి – బొంత+దళం-బొందళం- వీటిని మహాజన వ్యవహారంలోంచి గ్రహించాలన్నారు. ఇక క్రియా పరిచ్ఛేదంలో వడ్లమూడి అత్యద్భుతంగా కొన్ని సూత్రాలు రచించారు.
– విభిన్నమైన ప్రత్యయం పరమైతే సవర్ణానికి దీర్ఘం వస్తుందన్న సూత్రం చెప్పి… ఉభయ యాసలూ ఎలా ధ్వనిస్తాయో విపులీక రించారు. వండినాడు – వండినారు -వండినావు-వండినారు-వండినాను-వండినాము-వండినది-వండినవి-పండినది-పండినవి.
ఇది భిన్నమైన ప్రత్యయం అనడం చేత ‘య’ ప్రత్యయం పరమైతే దీర్ఘం- ‘య’ ప్రత్యయ ఇకారానికి లోపం పూర్వస్వరానికి దీర్ఘం వైకల్పితంగా కనిపిస్తున్నదని సూత్రం కట్టి -అన్నాడు -అన్నడు. విన్నాడు- విన్నడు- విన్నారు-విన్నరు అని విపులీకరించారు. ఇక్కడ యాసలు గమనార్హం!
‘ఉత్తమ పురుషలోను వర్ణలోపం -పువర్ణ ఉత్వానికి లోపం వైకల్పితం: ఈ సూత్ర రీత్యా…. వచ్చినవ్- అన్నవ్- అన్న – విన్న- నేను విన్నగద-మొదలైనవి ప్రయోగాలుగా చూపారు.
అన్నాను – విన్నాను – బహుత్వంలో అన్నం – విన్నం చెప్పినం- అన్నాము.. విన్నాము – చెప్పాము – చెప్పినాము మొదలైనవి యాసల పరంగా ప్రయుక్తాలవుతాయని సుదీర్ఘ వివరణిచ్చారు.
‘ది వర్ణకం పరమైతే న వర్ణకానికి బిందువు వైకల్పికం’ అనే సూత్రంలో వండినది – వండింది – పండినది- పండింది. కొట్టినది – కొట్టింది – చేసినది – చేసింది. అడిగినది – అడిగింది -అనినది అన్నది. అనింది – వినినది – విన్నది – వినింది. మొదలైనవి.
ఇందులోనే అన్వాదుల ఇత్వలోప పక్షంలో న వర్ణకానికి బిందువు వస్తే బిందువుకు పూర్వాన వ్యంజనం నిలవదు. కాబట్టి అది లోపిస్తుంది. కాగా అంది-వింది-తింది మొదలైన రూపాలు సిద్ధిస్తాయి.భూతంలో కొన్నిచోట్ల డు వర్ణకం పరమైతే బిందువు రు వర్ణకం పరమైతే న వర్ణ స్వర లోపం కనిపిస్తున్నదని వడ్లమూడి వారు విపులీకరించి, వండిండు – తెచ్చిండు – తిట్టిండు – వండిన్రు – కొట్టిన్రు- తిట్టిన్రు అని క్రియాశీల పదాలు చూపారు.
-స్త్రీ నుద్దేశించినపుడు కదా తుది ఆకారానికి ఏత్వం వైకల్పికం’ అనే సూత్రరచనలో వడ్లమూడివారి పరిణితి వర్ణనాతీతం!
అవునోకాదో కదా ! – అవునోకాదోకదే!-నిజమో అబద్ధమో కదా!- నిజమో అబద్ధమో కదే! ఆదరాద్యర్థ సూచకంగా పురుషుణ్ణి ఉద్దేశించినప్పుడు సైతం సత్యం కొన్ని చోట్ల కనిపిస్తున్నది.
వడ్లమూడి గోపాల కృష్ణయ్య చిన్న వయస్సులో వ్యావహారిక భాషా విషయకంగా వారు చేసిన కృషి అనన్య మైనది.
రాజఫణి, 92479 37923