యూ…రియా
వేర్ ఆర్ యూ
యూ ఆర్ నాట్ ఫర్ మీ
ఒక్క బస్తా కోసం
చేంతాడంత లైను
నిలవడి నిలవడి యాష్టకొస్తే
చెప్పుల లైను
నడిజాముకు లేశి పోయిన గూడా
నాలెక్క ఎంతోమంది లైను కాడ
జాగారం చేసి లైన్ల నిలవడ్డంక
‘జాక్ పాట్’
నా దాక వస్తదో లేదో అనే రంది
అదును తప్పితే
చేను పచ్చవడుతదో లేదో అనే బాధ…
నేను ముందంటే నేను ముందనే సిగపట్లు
మార్పు మార్పు అని ఊదరగొడితే
ఏమో అనుకున్నాం
ఇట్లా ఎనుకటి రోజులొస్తయనుకోలే
పెద్దసారు ఉండంగ
ఇంటికాడ ఉండి
ఆటో పిలగానికి పైసలిస్తే అయిపోయింది
ఎన్నంటే అన్ని బస్తాలు
బాయి దాకా ఏసుకొచ్చిండు..
ఇయ్యాల ఇంటిల్లిపాది లైన్ల నిలవడ్డా
మనిషికో బస్తా
దొరికితే దొరికినట్టు లేకుంటే లేదు..
మా నడుములు పోన్గా
నడిజాముకు లేశి లైన్ల నిలవడితే
ముఖ్యమంత్రి మా లైన్లను
హిట్టు సిన్మా టికెట్లతో పోలుస్తుండు
మంత్రేమో యాసంగికి
దాసుకుంటుండ్రంటుండు…
సారూ…
మీరు ఎలచ్చన్లప్పుడు సిన్మా సూపిస్తే
నమ్మి ఓటేశినం గానీ
ఇప్పుడిప్పుడే తెల్సొస్తుంది
మీరు రైతు బాంధవులు కారు
మమ్మల్ని పీక్కుతినే రాబందులని..
– మాదాసు శ్రీనివాస్