అరక లేదు భూమి లేదు
కౌలుదారులు జీతగాళ్లుగా వెట్టి చాకిరీలు
ఎదిరిస్తే వీపుల మీద బండలు, వాతలు
జుట్టుకు పన్ను ఊరేగింపుకు హుకుమత్లు
తెలుగు భాష గొంతు పిస్కిన ఉర్దూ ఫర్మానాలు
పండుగ సంబరాలు లేవు పౌర హక్కులు లేవు
సూర్య గ్రహణంలా చీకటి
భూస్వాములు పెత్తందారుల
కాళ్లు కందకుండా కిర్రు చెప్పులు
రోజుకు ఐదు కుండల కల్లు
నాగళ్ళు చెక్కాలి, కర్లు సరసాలి
కుండలియ్యాలి, పల్లకీ మోయాలి
బట్టలుతుకాలి, క్షౌరాలు చేయాలి
పసుపు దంచాలి, కారం గొట్టాలి
వృత్తుల వారీగా నిర్బంధ వెట్టి చాకిరీలు
దున్నే వానికే భూమని, భుక్తికై, విముక్తికై
నూనూగు మీసాల యువ కిశోరాలు
కొదమ సింహాల్లా గర్జనలు
ఉడుకు రక్తాల ఉప్పెనలు
వీర మాతల వీరోచిత ప్రజాతంత్ర
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల ప్రవాహాలు
గడ్డి మొలకలన్నీ
గడ్డ పారలై తిరుగబడి ఉరికి వచ్చినయి
పిడుచ కట్టిన చేతులు బందూకులెత్తినయి
కారం, రోకలి, వడిసెలు, బరిసెలు,
కర్రలు, గొడ్డళ్లతో సాయుధ దళాలయ్యారు
ఊరూవాడా ఉప్పెనై గన్ను,
గళమొక్కటై తెలంగాణ ఎరుపెక్కింది
బందగీ రక్తంబు చింది జ్వాలలై లేచే…
ఐలమ్మ, కొమురయ్యల నెత్తురు పారే
బండెన్క బండి గట్టి
ఊరూరూ, వీధి వీధినా
సాంస్కృతిక చైతన్య కేతనాలై
కదం తొక్కి గర్జించిన ప్రజా పోరాటం
గోలకొండ పత్రిక తూటాలు
రయ్యత్, ఇమ్రోజ్ల అక్షర జ్వాలలు
గ్రంథాలయ ఉద్యమాలు సత్యాగ్రహాలై
ఆంధ్ర మహాసభ, రైతు మహాసభల ధిక్కారాలు
భూస్వామ్య దుర్మార్గాల్ని చీల్చి
చెండాడిన కష్ట జీవుల పక్షాలు
తెగువతో చేసిన పోరాటానికి
నైజాం నిరంకుశత్వం తలదించింది
సమున్నత త్యాగాలు సమరాంగనలై నిలిచినవి
ఒక కల ఫలించింది
1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ ఐక్యత
తెలంగాణ ఆకాశంలో జాతీయ జెండా
ఉదయపు సూర్యుడికి అరుణాంజలి
-వనపట్ల సుబ్బయ్య, 94927 65358