ఇప్పుడు జరుగుతున్నది కేవలం
ఇద్దరి మధ్య కొట్లాట అనిపిస్తుంది
మంటల్లో తగలబడుతున్నవి
మనింటికి కోసుల దూరంగా అగుపిస్తుంది
టీవీలో చూపించేది
టీ కప్పులో తుఫాన్ అని
నోరుజారిన విషగుళికలు
వ్యక్తుల సొంత అభిప్రాయాలని
సర్దుకొని పనిలో మునిగిపోతుంటాం
దిన పత్రికను నమిలేస్తున్నాం
ఒక్క వార్త గుండెలో గుచ్చుకోవట్లేదు
బిట్వీన్ ద లైన్స్
బోధపడటం లేదు ఎవ్వరికీ
చాపకింద కుట్రను కనిపెట్టక దాటేస్తున్నాం
ఎవ్వర్ని గిలకరించినా
విద్వేషం ఉబికివస్తున్నది
జాతరలు జరిపి పార్టీలు
రంగులు చల్లిపోతర్రు
అంతా ఓట్ల కోసం అని ఊరుకుంటాం
మందుగుండును దట్టించి
మెదడునిండా గుప్పిస్తున్నారని గుర్తించం
కప్పు కూలి
బతుకుల మీద పడుతున్నప్పుడు
అరుపులన్నీ అటూ ఇటూ
రక్షణ కోసం పరిగెడుతున్నప్పుడు
నువ్వూ నేను
చర్చించుకునేది ఏముండదు
సరిదిద్దుకునే సమయం
ఇంకా మిగిలి ఉంది
రెడ్ అలర్ట్ రాకముందే
రానున్న తరాలను
తుఫాన్ల నుంచి రక్షిద్దాం.. రండి..
– దాసరి మోహన్, 99853 09080