అమెరికాలో గతవారం రోజులుగా నెలకొన్న పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్నది.ఇలాంటి సమయంలో వ్యాపారసంస్థలు, పారిశ్రామికవేత్తలు సురక్షిత విధానాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభావం ఒక్క ఏడాదితో ఆగకపోవచ్చు. అమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఆర్థిక కార్యకలాపాలను అక్కడి రెగ్యులేటరీ గతవారం నిలిపేసింది.
ఎస్వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీశారు. దీంతో ఈ బ్యాంక్‌ను న్యూయార్క్ స్టేట్ రెగ్యులేటర్లు ఆదివారం మూసివేశారు.
అమెరికాలో నెలకొన్న పరిణామాలతో గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ధోరణి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ఇది ఎన్నో స్థాయిలను దాటిపోయింది. దీని ప్రభావం మిగతా దేశాలపై పడొచ్చు. అది ఈ ఒక్క ఏడాది లేదా వచ్చే ఏడాది వరకు మాత్రమే ఉంటుందని చెప్పలేం. అంతకుమించి కూడా కొనసాగవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే ప్రతీ ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తే ప్రమా దం ఉన్నప్పుడు.. కార్పొరేట్, సేవింగ్ ఫం డ్స్ పట్ల సరైన ప్రణాళికతో ఉండాలి. కార్పొరేట్లకైనా, మదుపర్లకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. పొదుపు ఖాతా నిర్వహించే వారై నా, గృహస్థులైనా ఇలాంటి సమయంలో సరైన ఆర్థిక ప్రణాళికతో తగిన మొత్తంలో నిధులను భద్రపరుచుకోవడం ముఖ్యం.
ఐఎంఎఫ్ అంచనాలు మారిపోయాయి: గత జనవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రపంచ దేశాల వృద్ధిరేటును అంచనా వేయడం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అంచనాలు మారిపోయాయని గమనించాలి. గత వారం రోజులుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా విశ్లేషించాలి. తద్వారా బ్యాంకు రుణాల వృద్ధి, అనుబంధ విధానాలు, రుణ మార్కెట్‌పై విశ్వాసం తదితర అంశాలను తెలుసుకోవచ్చు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేయొచ్చు. దీనిపై ప్రపంచ దేశాలు కొంతకాలం వేచిచూసే ధోరణి ప్రదర్శించాలి. ఒకవేళ అలాంటి నిర్ణయమే వెలువడితే, దాని ప్రభావం అమెరికన్ డాలర్‌పై ఎలా ఉండబోతున్నదో కూడా విశ్లేషించాలి. ఈ పరిణామాలన్నీ భారత్ వంటి ప్రధాన ఆర్థికవ్యవస్థలపై ఏమేరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉన్నది. నా అంచనా ప్రకారం.. వడ్డీరేట్ల పెంపునకు విరామాన్ని ప్రకటిస్తూ ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకొంటే, అక్కడి కరెన్సీపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది సానుకూల సంకేతాలకు దారితీయొచ్చు. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్.. ఖాతాదారుల కోసం ఇతరత్రా ఏర్పాట్లు చేసినట్లయితే, దాని ప్రభావం ఇతర బ్యాంకులతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో గమనించాలి. మొత్తానికి అమెరికాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులతో పాటు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు క్లిష్టమైనదేనని చెప్పాలి.
అనిశ్చితిని తప్పించుకోవాలంటే..: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమే. ఫెడరల్ రిజర్వ్ తీసుకొనే నిర్ణయం అక్కడి చమురు ధరలు, వడ్డీరేట్లు, డాలర్ మారకం, ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపినట్లయితే, ఆ పరిణామం సాపేక్షంగా భారత్‌కు సానుకూలంగానే ఉండొచ్చని భావించవచ్చు. ఇదే సమయంలో తాజా పరిణామాలు దీర్ఘకాలంలో ఎలా ఉండబోతున్నాయని ఇప్పుడే చెప్ప లేం. కాబట్టి, అనిశ్చితిని తప్పించుకోవడానికి ఆర్థిక విధానాలను రూపొందించుకోవ డం ఇప్పుడు ప్రధానం. భారత ఆర్థిక విధానాల్లో ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు మొదలెట్టాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా వేస్తున్నాం.
ప్రస్తుతం ఉన్న ఉష్టోగ్రతలు మరో వారంపాటు కొనసాగితే, గోధుమ పంట చేతికొస్తుంది. దిగుబడి పెద్దమొత్తంలో ఉండొచ్చు. ద్రవ్యోల్బణం, వ్యవసాయ దిగుబడి, ద్రవ్య విధానంపై ఇది గొలుసుకట్టుగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. వచ్చే ఏడాది వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చు. అయితే, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లోని మూడు త్రైమాసికాలను విశ్లేషిస్తే, మనం కరోనా ముందు స్థాయి కంటే ఎక్కువ వృద్ధి సాధించినట్టు అర్థమవుతున్నది. జీడీపీలో ప్రైవేటురంగ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో 8-9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఆలోచించడం సరైంది కాదు. వచ్చే 7-8 ఏండ్లలో 6.5-7 లేదా 6.4-7 శాతం వృద్ధి సాధించినప్పటికీ, అది శుభ పరిణామంగానే భావించాలి. గడిచిన కొన్నేండ్లుగా ప్రభుత్వరంగంలో మూలధన వ్యయం పరిమాణం పెరుగుతున్నది. దీంతో రానున్న రోజుల్లో తయారీ రంగంలో వృద్ధి, ఎగుమతులు పెరుగొచ్చు. వచ్చే ఏడాది నామమాత్రపు జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉండొచ్చు.
వి.అనంత నాగేశ్వరన్
భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
(‘క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్’ సెమినార్లో చేసిన ప్రసంగ సారాంశం)