‘బతుకమ్మ’ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 3న జరిగే సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.
తెలంగాణ సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతిబింబంగా కొలిచే పండుగ బతుకమ్మ. ఈ పండుగ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరుపుకొంటారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి, ఏటా అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వేతర సంస్థలు కూడా బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించాలని 2014 జూన్ 16న ఉత్తర్వులు జారీచేయడం ఆహ్వానించదగిన పరిణామం. సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో వచ్చే బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైనది. తెలంగాణకు ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయం ఉన్నది. ఈ పండుగ ద్వారా అది మరింత వెల్లివిరుస్తుంది. రంగురంగుల పూలతో తాంబాలంలో బతుకమ్మను పేర్చితే గుడి గోపురానికి ఉన్నంత ప్రశస్తి బతుకమ్మకు వస్తుంది. అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ మహిళలు ఆడుకుంటూ, పాటలు పాడుతారు. తొమ్మిది రోజుల బతుకమ్మకు ముందుగా బొడ్డెమ్మ ఆడుతారు. ఆ తర్వా త మొదటి రోజు ఆడే బతుకమ్మను ఎంగిలిపూలు అని, 9 లేదా చివరిరోజున ఆడే ఆటను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. సద్దుల బతుకమ్మనే ‘పెద్ద బతుకమ్మ’ అని కూడా అంటాం.
బతుకమ్మ పండుగ ఇలా మొదలైందని చెప్పడానికి ఎన్నో కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు ఒక్కటి తీసుకుందాం. ఓ ముద్దుల చెల్లికి ఏడుగురన్నదమ్ములు. ఆ అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారు బొమ్మను బాధపెట్టేవారు. ఒకరోజు అన్నలు వేటకు వెళ్లిన సందర్భంలో ఆడబిడ్డను సూటిపోటి మాటలతో వేధిస్తారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అన్నలు వచ్చి మా ముద్దుల చెల్లి ఎక్కడ అని వాళ్ల భార్యలను నిలదీస్తారు. విషయం తెలుసుకొని చెల్లి కోసం వెతుక్కుంటూ వెళ్తారు.
ఒక పొలిమేర దగ్గర ఉన్న బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామర పువ్వు వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ దగ్గరికి వస్తుంది. ఆ తామరపువ్వునే తమ చెల్లిగా భావించి పలురకాల పూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేసుకుంటారు. అదే బతుకమ్మ పండుగ అని జానపద కథ. అయితే తెలంగాణలో శతాబ్దాల తరబడి బతుకమ్మ పండుగ ఉన్నదనేది వాస్తవం. ప్రపంచమంతా పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆ పూలనే పూజించే అరుదైన, గొప్ప సంస్కృతి తెలంగాణలో బతుకమ్మగా బతికి ఉన్నది. ప్రకృతిని ఆరాధిస్తూ సృష్టిలో మహిళల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఏకైక ఉత్సవం కూడా బతుకమ్మనే. ఆడపడచులు ఎలాంటి కులభేదాలు లేకుండా ఆడిపాడుతూ ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తారు. బతుకమ్మ పండుగ సమయంలో చెరువులు, కుంటలన్నీ దాదాపు నీటితో నిండి కళకళలాడుతూ ఉంటాయి. వాటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసినప్పుడు హానికర సూక్ష్మజీవులు నశించి నీరు శుద్ధి అవుతుంది. బతుకమ్మకు వాడే పలురకాల పూలు, ఆకులకు సహజంగా నీటిని శుద్ధి చేసే గుణాలుంటాయి. ఇలాంటి బతుకమ్మ పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యానికి కారణమవుతుంది.
బతుకమ్మ పండుగ వస్తుందంటే తెలంగాణలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఇక్కడి ప్రజలు అదొక పెద్ద సంబురంగా భావిస్తారు. ఇల్లు శుభ్రపరుచుకొని, చక్కగా అలంకరించుకుంటారు. ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువస్తారు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలను అత్తగారింటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడబిడ్డ ఎప్పుడు కన్నవారింటికి వెళ్లాలా? పుట్టింటి నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా? తనను తీసుకువెళ్లడానికి అన్న ఎప్పుడు వస్తాడా అని ఆత్రంగా చూస్తారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి ఈ సాంస్కృతిక విప్లవం ముఖ్య భూమిక పోషించింది. దానిలో భాగంగా పలురకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటలాడుతూ, పాటలు పాడుతూ బతుకమ్మలను నెత్తినెత్తుకొని తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం సాగింది. రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర కీలకమైంది. బతుకమ్మ ఆడుకోవడం ఒక ఉద్యమంగా సాగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతేకాకుండా బతుకమ్మ పూలలో కీలకమైన తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువులన్నీ నిండి బతుకమ్మ పండుగకు మరింత శోభను తెస్తున్నాయి. ఇక పండుగ ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిరాదరణకు గురైంది. మన హైదరాబాద్లో బతుకమ్మ ఆడుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టించారు ఉమ్మడి పాలకులు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి గ్రామానికి నిధులను విడుదల చేస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తుండటం శుభసూచకం. ఇప్పటికే విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పండుగ రానున్న రోజుల్లో మరింత ప్రజాదరణ ప్రశంసలు పొందాలని ఆశిద్దాం.
– డాక్టర్ కోడూరి శ్రీవాణి
99631 88743
(వ్యాసకర్త: అర్థశాస్త్ర విభాగాధిపతి, శాతవాహన యూనివర్సిటీ)