సినిమా అంటే గ్లామర్.. సినిమా అంటే రంగుల లోకం.. సినిమా అంటే కోట్ల మందిని ప్రభావితం చేసే సాధనం. కానీ, దురదృష్టవశాత్తు నేటి తరం యువ హీరోలు గ్లామర్‌ను బూతుగా, నటనను ఓవరాక్షన్‌గా భ్రమిస్తున్నారు. తాజాగా బుల్లితెర సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ చేసిన ‘హంగామా’ చూస్తుంటే.. టాలీవుడ్లో సంస్కారం అన్న మాటకు అర్థమే మారిపోతున్నదా అనే అనుమానం కలుగుతున్నది.
తన కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ ప్రదర్శించిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. సెన్సేషన్ అంటే అద్భుతమైన నటనతో కాదు.. అత్యంత అసభ్యకరమైన పదజాలంతో! స్టేజీ ఎక్కి మైక్ పట్టుకున్న ఈ ‘వారసుడు’.. ముందూ వెనుక ఆలోచించకుండా, మహిళలు ఉన్నారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాట పాడటం అందరినీ విస్తుపోయేలా చేసింది.
కాంట్రవర్సీయే పబ్లిసిటీనా?: ఈమధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమాలో విషయం ఉన్నా లేకపోయినా.. పాటల్లో బూతులు పెడితే, స్టేజీలపై పిచ్చిపిచ్చిగా వాగితే అది వైరల్ అవుతుందని, తద్వారా పబ్లిసిటీ వస్తుందని కొందరు భావిస్తున్నారు. చంద్రహాస్ ప్రవర్తన కూడా అలాగే ఉన్నది. మొదటి సినిమా నుంచి అతడి తీరుపై విమర్శలు వస్తున్నా… తప్పుదిద్దుకోవాల్సిందిపోయి, మరింత బరితెగించి విమర్శకులకు ‘కంటెంట్’ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
బూతే బూతు: అతడు పాడిన పాట పల్లవి, చరణాల్లో ఎన్ని తిట్లు, హెచ్చరికలు ఉన్నాయో, ఎంత ఎనర్జీ ఉన్నదో ఔత్సాహికులు తెలుసుకోవచ్చు. అలాగే ఎన్ని వినకూడని, అనకూడని బూతులున్నాయో సెన్సార్ బోర్డులో ఎవరైనా పీహెచ్డీ చేయవచ్చు. ఇది ఇక్కడితో ఆగదు. పబ్లిక్ వేదికల మీద పరవశించి మైకుల్లో బూతులను తీవ్ర శ్రుతిలో పాడుతుంటే చానళ్లలో లైవ్ వస్తున్నది. ఈ బూతు కోట్ల వ్యూస్‌తో ప్రతిధ్వనిస్తున్నది.
సెన్సార్ బోర్డు స్పందిస్తుందా?: సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి డైలాగును క్షుణ్నంగా పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చే సెన్సార్ బోర్డు ఇలాంటి బహిరంగ వేదికలపై జరుగుతున్న అరాచకాలను ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వెండితెరపై పొగ తాగే దృశ్యం కనిపించినప్పుడు ‘హెచ్చరిక’లు వేయాలని నిబంధన ఉన్నది. అలాంటిది వేలాది మంది చూస్తున్న లైవ్ ఈవెంట్లలో, యూట్యూబ్ వేదికగా సాగుతున్న ఈ ‘బూతు గానం’పై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేవలం సినిమా నిడివిని కత్తిరించడమేనా సెన్సార్ పని? ఇలాంటి అసభ్యకరమైన సాహిత్యం పబ్లిక్ డొమైన్‌లోకి రాకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత వారిపై లేదా?
నియంత్రణ లేని యూట్యూబ్ ప్రమోషన్లు!: ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ల పేరుతో ఏం చేసినా చెల్లిపోతుందనే ధీమా పెరిగిపోయింది. సెన్సార్ బోర్డు పరిధి కేవలం థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకే పరిమితం కాకుండా, ప్రమోషన్ల కోసం విడుదల చేసే పాటలు, వీడియోలపై కూడా కఠినమైన నిఘా ఉంచాల్సిన అవసరమున్నది. ’బరాబర్’ సినిమాలో ఈ పాట ఉంటుందో ఉండదో తెలియదు కానీ, ప్రమోషన్ పేరుతో ఈ ‘బూతు రాగాన్ని’ వైరల్ చేసి యువత మెదళ్లను కలుషితం చేయడం దారుణం. వివాదాల ద్వారా టికెట్లు తెగాలని చూసే ఇలాంటి ధోరణిని సెన్సార్ అధికారులు కఠినంగా అణచివేయాలి.
సమాజం ఎటు పోతున్నది?: సాహిత్యం అంటే భావం ఉండాలి.. సంగీతం అంటే వినసొంపుగా ఉండాలి. కానీ, ఇప్పుడు బూతు అర్థాలే సినిమా పాటలకు పెట్టుబడిగా మారుతున్నాయి. సాహితీ విలువల గురించి మాట్లాడే పెద్దలు కూడా ఈ మధ్య ఇలాంటి వ్యవహారాలపై మౌనం వహించడం విచారకరం. కేవలం వ్యూస్ కోసమే పాకులాడే ఈ ‘వ్యూస్ పిచ్చి’ హీరోలు, నిర్మాతలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
వివాదాలతో వచ్చే గుర్తింపు తాత్కాలికం. అది కేవలం ట్రోల్స్‌కు మాత్రమే పరిమితం. నిజమైన నటుడిగా నిలబడాలంటే నటనలో లోతు ఉండాలి. ప్రవర్తనలో వినయం ఉండాలి. చంద్రహాస్ తన ప్రవర్తన, భాషను మార్చుకోకపోతే…ప్రేక్షకులు అతడిని హీరోగా కాదు, కేవలం ఒక ‘ట్రోల్ మెటీరియల్’గానే చూస్తారనడంలో సందేహం లేదు. బూతులతో కాదు ప్రతిభతో గెలువాలి!
కాశ్యప్