Britain Election | బ్రిటన్ ప్రజల తీర్పు.. సామరస్యవాదాన్ని గెలిపించిన ఓటర్లు
బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారు. పద్నాలుగేండ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనను తిరస్కరించి లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఫ్రాన్స్‌తో సహా యూరప్ ఖండమంతటా జాత్యహంకారవాదులు పైచేయి సాధిస్తుంటే బ్రిటిష్ ఓటర్లు మాత్రం సామరస్యవాదాన్ని గెలిపించారు.
Britain Election | బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారు. పద్నాలుగేండ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనను తిరస్కరించి లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఫ్రాన్స్‌తో సహా యూరప్ ఖండమంతటా జాత్యహంకారవాదులు పైచేయి సాధిస్తుంటే బ్రిటిష్ ఓటర్లు మాత్రం సామరస్యవాదాన్ని గెలిపించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ, శరణార్థి వ్యతిరేక రాజకీయ గావుకేకలను అత్యధిక శాతం ప్రజలు ఏ మాత్రం ఇష్టపడటం లేదని ఫలితాలతో తేలిపోయింది. భారతీయ మూలాలున్న రుషి సునాక్ ప్రధాని పదవి చేపట్టి కన్జర్వేటివ్ పార్టీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఆర్థికరంగ నైపుణ్యం రాజకీయాలను మలుపు తిప్పలేకపోయింది.
సామాన్యుల సంక్షేమానికి పెద్దపీట వేసే సామాజిక న్యాయ పార్టీగా పేరుపొందిన లేబర్ పార్టీ మొత్తం 650 స్థానాల్లో 63 శాతం, అంటే 412 సీట్లలో ఘనవిజయం సాధించింది. కాగా కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లకే పరిమితమైంది. సుమారు 200 సంవత్సరాల చరిత్రలో ఆ పార్టీకి ఇంత ఘోర పరాభవం ఎన్నడూ సంభవించలేదు. అయితే అద్భుతమైన విజయం సాధించిన లేబర్ పార్టీకి 34 శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ‘ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్’ (మొదటగా గీత దాటినవారే విజేత) అనే సూత్రం ప్రకారం మూడింట రెండొంతుల స్థానాలు ఆ పార్టీ సొంతం చేసుకోగలిగింది. మాజీ ప్రధాని సునాక్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పటికీ మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో సహా 11 మంది క్యాబినెట్ మంత్రులు లేబర్ సునామీలో కొట్టుకుపోయారు.
చరిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ ఎన్నికల్లో కొన్ని ఇతర పార్టీల జయాపజయాలు బ్రిటన్ ప్రజల ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి. పర్యావరణ రక్షణ లక్ష్యంగా అవతరించిన గ్రీన్స్ పార్టీ తన బలాన్ని ఒకటి నుంచి నాలుగుకు పెంచుకోగలిగింది. అదే సమయంలో శరణార్థి వ్యతిరేక విధానాలతో దూకుడుగా వ్యవహరించే మితవాద రిఫామ్ యూకే పార్టీ పార్లమెంట్లో బోణీ కొట్టి నాలుగు సీట్లతో తొలిసారి అడుగుపెడుతున్నది. ఏడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ అధినేత నిగెల్ ఫరాజ్ ఈసారి విజయాన్ని చేజిక్కించుకోవడం బ్రిటన్‌లో అతివాదుల ప్రాబల్యం పెరగడాన్ని సూచిస్తున్నది. స్కాట్లాండ్కు స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న స్కాటిష్ నేషనల్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోయింది.
మరోవైపు ప్రస్తుతం బ్రిటన్‌లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ స్వాతంత్య్రాన్ని పొంది స్వతంత్ర దేశంగా కొనసాగుతున్న దక్షిణ ఐర్లాండ్‌తో విలీనం కావాలని కొట్లాడుతున్న సిన్ ఫెయిన్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రాంతీయంగా అతిపెద్ద గ్రూపుగా ముందుకురావడం కీలక పరిణామం. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దురాక్రమణ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పోటీచేసిన ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులూ గెలవడం చిన్న విషయమేమీ కాదు. ఇటీవలి కాలంలో బ్రిటన్ రాజకీయాల్లో పెరుగుతూ వస్తున్న శరణార్థి వర్గాల ప్రాబల్యం ఈసారి కూడా కొనసాగింది. గెలిచినవారిలో పలువురు స్టార్మర్ ప్రభుత్వంలో మంత్రులుగానూ చేరారు. అయితే తెలంగాణ మూలాలున్న ఇద్దరు అభ్యర్థులు – లేబర్ పార్టీ తరఫున పోటీచేసిన ఉదయ్ నాగరాజు, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ చంద్ర కన్నెగంటి ఓటమి చవిచూశారు.
ప్రజాగ్రహాన్ని ఆమోదించి ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సునాక్ తప్పుకోవడంతో సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన కీర్ స్టార్మర్ ప్రధానిగా ‘నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్’ నివాసంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రధాని స్టార్మర్ ముందు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నాయి. ముఖ్యంగా ఆర్థికరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. సంపన్న దేశాలన్నిటిలో పేదరికం అధికంగా ఉన్న దేశంగా బ్రిటన్ అపకీర్తి మూటగట్టుకున్నది. తక్షణం సంక్షేమాన్ని పట్టాలెక్కించి పేదలకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అంతర్జాతీయంగా అమెరికా విధానాలకు తోకగా మారిన బ్రిటన్ను ఆ ముద్ర నుంచి బయటపడేయాల్సి ఉంది. యురోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమణను (బ్రెగ్జిట్) వెనుకకు తిప్పి తిరిగి ఆ యూనియన్‌లో చేరే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. యూరప్ దేశాలతో ఆర్థిక అనుసంధానాన్ని మెరుగుపర్చుకోవడం అనేది మరో పెను సవాల్. ఈ సమస్యల నేపథ్యంలో తక్షణమే కార్య రంగంలోకి దూకడమే తన ముందున్న కర్తవ్యమని ప్రధాని స్టార్మర్ ప్రకటించడం విశేషం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

