ఆధ్యాత్మిక వసంతం..!
ఇస్లామీయ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్-హిజ్జా కేవలం ఒక కాల చక్రంలోని నెల మాత్రమే కాదు; అది ఆధ్యాత్మిక వసంత కాలం. సృష్టికర్త అయిన అల్లాహ్ తన కరుణాకటాక్షాలను కురిపించేందుకు ఎంచుకున్న అత్యంత పవిత్రమైన సమయం. ముఖ్యంగా ఈ మాసంలోని మొదటి పది రోజులు విశ్వాసుల పాలిట ఒక దివ్య వరం.
- ఇస్లాం బోధ
ఇస్లామీయ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్-హిజ్జా కేవలం ఒక కాల చక్రంలోని నెల మాత్రమే కాదు; అది ఆధ్యాత్మిక వసంత కాలం. సృష్టికర్త అయిన అల్లాహ్ తన కరుణాకటాక్షాలను కురిపించేందుకు ఎంచుకున్న అత్యంత పవిత్రమైన సమయం. ముఖ్యంగా ఈ మాసంలోని మొదటి పది రోజులు విశ్వాసుల పాలిట ఒక దివ్య వరం. పవిత్ర ఖురాన్లోని ‘సూరా అల్-ఫజర్’లో అల్లాహ్ ‘పది రాత్రుల’పై ప్రమాణం చేయడం ఈ రోజుల మహోన్నత స్థితికి నిదర్శనం.
మహనీయ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనల ప్రకారం, ఈ పది రోజుల్లో చేసే పుణ్యకార్యాలు అల్లాహ్ దృష్టిలో సంవత్సరంలోని మరే ఇతర రోజుల్లో చేసే పనుల కంటే గొప్పవి. ఈ కాలంలో ఇస్లాం మూల స్తంభాలైన నమాజ్, ఉపవాసం, దానధర్మాలు, హజ్ వంటి ఆరాధనలన్నీ మేళవించి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు మక్కాలో సమావేశమై, రంగు, జాతి, భాషా భేదాలు లేకుండా ఒకే రకమైన ‘ఇహ్రామ్’ వస్త్రధారణలో కనిపించడం ఇస్లామీయ సమానత్వానికి, ఐక్యతకు గొప్ప నిదర్శనం. జుల్-హిజ్జా 9వ రోజైన ‘అరఫా’ అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం, రాబోయే సంవత్సరం పాపాల ప్రక్షాళన జరుగుతుందని ప్రవక్త వాక్కు. ఇది మన ఆత్మను ప్రక్షాళన చేసుకుని, దైవానికి మరింత దగ్గరవ్వడానికి లభించిన ఒక గొప్ప అవకాశం.
హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం), హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం)ల అపూర్వ త్యాగాన్ని స్మరించుకుంటూ మనం చేసే ‘కుర్బానీ’ వెనుక లోతైన అంతరార్థం ఉంది. ఇది కేవలం ఒక జంతువును బలి ఇవ్వడం కాదు; మనలోని స్వార్థాన్ని, అహంకారాన్ని, పగను బలి ఇవ్వడం. దైవాజ్ఞ ముందు మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టడమే అసలైన త్యాగం.
ఈ పవిత్ర దినాలను కేవలం పండుగ హడావిడిలో గడపకుండా, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకోవాలి:
1. ధ్యానం – జికర్: హృదయం దైవస్మరణతో నిండి ఉండాలి. ‘తక్బీరాత్’ పఠిస్తూ అల్లాహ్ గొప్పతనాన్ని చాటి చెప్పాలి.
2. తౌబా (క్షమాపణ): చేసిన తప్పులను ఒప్పుకొంటూ, సృష్టికర్త ముందు తలవంచి మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకోవాలి.
3. నైతిక ప్రవర్తన: మాటల్లో నిజాయతీ, చేతల్లో పారదర్శకత ఉండాలి. తోటి మనుషులను నొప్పించకుండా ప్రేమను పంచాలి.
4. మానవత్వం: దానధర్మాలు చేస్తూ పేదలను, ఆపన్నులను ఆదుకోవాలి. సృష్టికర్తను మెప్పించాలంటే ఆయన సృష్టిని ప్రేమించడం మొదటి మెట్టు.
జుల్-హిజ్జా మాసం మనకు లభించిన ఒక ఆధ్యాత్మిక కానుక. బాహ్య ప్రదర్శన కంటే ఆత్మ శుద్ధికి ప్రాముఖ్యతనిస్తూ, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక నవజీవనానికి నాంది. ఈ పవిత్ర రోజులను ప్రార్థనలతో, మానవ సేవతో గడుపుదాం.
…? ముహమ్మద్ ముజాహిద్,96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

