– ఇస్లాం బోధ
‘హాజీ’ అంటే కేవలం ఒక సామాజిక హోదా కాదు. అది అంతరంగాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక విప్లవం. అల్లాహ్ అపార కరుణతో లక్షలాది మంది హుజ్జాజ్లు హజ్ ముగించుకుని స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. పవిత్ర కాబాను, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర సమాధి (రౌజా-ఎ-రసూల్)ని దర్శించుకునే భాగ్యం పొందిన వీరి రాక సమాజంలో ఒక భక్తిభావ వాతావరణాన్ని నింపుతున్నది. హజ్ అనేది కేవలం ఒక సంప్రదాయ ఆరాధన కాదు; అది ఒక గొప్ప శిక్షణా ప్రక్రియ. హజ్ తర్వాత మనిషి జీవితం ఒక స్వచ్ఛమైన తెల్లటి కాగితంలా మారాలి. దానిపై దైవభీతి (తఖ్వా), ఉత్తమ నడవడిక అనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాల్సి ఉంటుంది.
నేటి డిజిటల్ యుగంలో కొందరు హజ్ లాంటి నిశ్శబ్ద ఆరాధనను కూడా ఒక ప్రదర్శన వస్తువుగా మార్చేస్తున్నారు. అడుగడుగునా సెల్ఫీలు, సోషల్ మీడియా లైవ్‌లు, విమానాశ్రయాల వద్ద వందలాది కార్ల కాన్వాయ్‌లు, హంగామాలు హజ్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. హృదయంలో ‘హాజీ సాబ్’ అని పిలిపించుకోవాలనే తపన, చౌకబారు కీర్తి కాంక్షలు ఆరాధన పుణ్యాన్ని (సవాబ్ను) నశింపజేస్తాయి. హజ్ అసలు విజయం పూలదండలు వేయించుకోవడంలో లేదు; ప్రవక్త జీవన విధానపు (సున్నత్) వెలుగును తమ జీవితాల్లో ఆచరించడంలోనే ఉంది. అరఫాత్ మైదానంలో కార్చిన కన్నీళ్లు, కాబా ప్రదక్షిణలు కేవలం జ్ఞాపకాలు కావు; అవి జీవితాంతం నిలబెట్టుకోవాల్సిన పవిత్ర బాధ్యతలు (అమానత్లు). మౌలానా జకరియా కాంధ్లవీ ‘మీ జీవితాన్ని చూసి ప్రజలకు మక్కా, మదీనాలు గుర్తుకురావాలి’ అని హాజీల ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పారు.
ఆరాధనలు: ఐదు పూటల నమాజుల నియమావళి, ఖురాన్ పఠనం, దైవస్మరణ (జికర్) చేయాలి.
నైతికత-సంపాదన: హలాల్ (ధర్మబద్ధమైన) సంపాదన, వ్యాపార లావాదేవీలలో నిజాయతీగా ఉండాలి.
సామాజిక బాధ్యత: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పొరుగువారి హక్కులను (హుకూకుల్ ఇబాద్) నెరవేర్చాలి. ఆస్తి పంపకాలలో
అన్యాయానికి తావు ఇవ్వకూడదు.
మంచి సాంగత్యం: సజ్జనుల సాంగత్యం ద్వారా హజ్ సానుకూల ప్రభావాలను కాపాడుకోవాలి. హజ్ తర్వాత ప్రతి హాజీ సమాజంలో ఇస్లాం సజీవ రాయబారిగా మారాలి. హజ్ యాత్రికుల మారిన పవిత్ర ప్రవర్తనే… వారి హజ్ అంగీకారమైనది అనడానికి అతిపెద్ద ధ్రువీకరణ పత్రం!
– ముహమ్మద్ ముజాహిద్
96406 22076