దుర్గమ్మా.. మాలో కొలువై ఉండమ్మా!
సృష్టికి మూలం స్త్రీ. అటువంటి స్త్రీ శక్తిని కేవలం పండుగలకు, పూజలకు మాత్రమే పరిమితం చేయకుండా, ఈ ఆధునిక కాలంలో సమాజం సరిగ్గా అర్థం చేసుకోవడానికి దుర్గాదేవి తత్వం ఒక సజీవ దీపస్తంభంలా నిలుస్తుంది.
సృష్టికి మూలం స్త్రీ. అటువంటి స్త్రీ శక్తిని కేవలం పండుగలకు, పూజలకు మాత్రమే పరిమితం చేయకుండా, ఈ ఆధునిక కాలంలో సమాజం సరిగ్గా అర్థం చేసుకోవడానికి దుర్గాదేవి తత్వం ఒక సజీవ దీపస్తంభంలా నిలుస్తుంది. పురాణాలలో రాక్షసులను అంతం చేయడానికి దుర్గాదేవి ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. కానీ, వర్తమాన కాలంలో ఆమె రూపం, ఆమెలోని ధైర్యం, ఆత్మరక్షణ, చైతన్యం ప్రతి మనిషిలో, ముఖ్యంగా ప్రతి మహిళలో జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పురాణాల్లో మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసులు ఎలాగో, నేటి సమాజంలో మనిషి అంతరంగంలో ఉన్న రాక్షసత్వమే పెద్ద ప్రమాదంగా మారింది. అహంకారం, స్వార్థం, మోసం, అసూయ, స్త్రీలపై చిన్నచూపు చూసే మతతత్వ/ పురుషాధిక్య భావజాలం ఇవన్నీ నేటి ఆధునిక కాలపు రాక్షసులు. మనిషిలోని ఈ అంతర్గత దుర్గుణాలను (అరిషడ్వర్గాలను) సంహరించడానికి ప్రతి ఒక్కరిలోనూ దుర్గాదేవి తత్వం కావాలి.
స్వార్థాన్ని వీడి సమాజహితం కోరే తత్వాన్ని అలవర్చుకోవడమే నిజమైన దుర్గా ఉపాసన. మన దైనందిన జీవితంలో నిరుద్యోగం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు మనిషిని కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న కష్టానికే కుప్పకూలిపోకుండా, జీవితంలో ఎదురయ్యే ఏ దుర్గమమైన సమస్యనైనా ఎదుర్కొనే అచంచలమైన మనోైస్థెర్యాన్ని దుర్గాదేవి ఆరాధన ఇస్తుంది. ‘దుర్గ’ అంటే కష్టాలను దాటించేది అని అర్థం.
కాబట్టి, యువతకు, నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రతి ఒక్కరికీ జీవిత పోరాటంలో ఓటమిని గెలుపుగా మార్చుకునే మానసిక శక్తిని అందించడానికి దుర్గాదేవి స్ఫూర్తి కావాలి. ఒక ఇంట్లో తల్లిగా, ఉద్యోగంలో బాధ్యతాయుతమైన మహిళగా, సమాజంలో నాయకురాలిగా స్త్రీ అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సకల దేవతల తేజస్సుతో ఉద్భవించిన దుర్గాదేవి సర్వశక్తిమంతురాలు. నేటి మహిళ కేవలం కుటుంబ బాధ్యతలే కాకుండా, దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యాపారాలు, రాజకీయాలు ఇలా ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుతున్నది. సమాజంలో స్త్రీలకు సమాన అవకాశాలు లభించినప్పుడే, వారిలోని నిజమైన శక్తి (దుర్గా స్వరూపం) బయటికి వచ్చి దేశాన్ని ప్రగతి పథంలో
నడిపిస్తుంది.
దుర్గాదేవి ప్రకృతికి, మాతృత్వానికి ప్రతీక. కానీ, కాలుష్యం, చెట్ల నరికివేత, ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల భూదేవి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక తల్లి తన పిల్లలను ఎలా కాపాడుతుందో, అలా ఈ సమస్త సృష్టిని కంటికి రెప్పలా కాపాడే జగన్మాత తత్వాన్ని నేటి సమాజం అలవర్చుకోవాలి. పర్యావరణాన్ని రక్షించడం, భూమిని కాపాడుకోవడం కూడా దైవారాధనతో సమానమనే స్పృహను నేటి తరం పెంపొందించుకోవాలి.
దుర్గాదేవి అంటే కేవలం ఒక విగ్రహం కాదు, నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి. అన్యాయాన్ని ఎదిరించే గొంతుకలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే కరుణలో, కష్టాలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసంలో దుర్గాదేవి ప్రతిఫలిస్తుంటుంది. నేటి సమాజంలో స్త్రీలను గౌరవిస్తూ, వారిని అబలగా కాకుండా సబలగా, శక్తి స్వరూపిణిగా చూసే సంస్కృతి పరిఢవిల్లినప్పుడే నిజమైన దుర్గా పూజ సంపూర్ణమవుతుంది. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతిక్షుబ్ధ వాతావరణాన్ని తొలగించడానికి, మానవత్వాన్ని కాపాడడానికి దుర్గాదేవి ఆదర్శాలు నేటికీ, ఎప్పటికీ ఎంతో అవసరం.
-తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, 80085 77834
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

