అంబర్పేట : పాత నేరస్తుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి తెలిపిన వివరాల ప్రకారం..నల్లకుంట టీఆర్టీ కాలనీలో నివాసముండే ఎండీ అబ్రార్ (21) పాత నేరస్తుడు. ఇతనిపై అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి. సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశారు.
అయితే జనవరి 1న రాత్రి పీకలదాక మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. దీంతో వారు అతని గొడవ భరించలేక అదే రాత్రి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. రెండున రాత్రి అతని మామ టీఆర్టీలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లగా ఉరివేసుకొని కనిపించాడు. అతన్ని కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయాడు.
అయితే పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట రాసి షర్ట్ జేబులో పెట్టుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసుల వేధింపులపై ఇన్స్పెక్టర్ రవి స్పందిస్తూ తాము ఎప్పుడు కూడా అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లలేదని చెప్పారు.
అతనిపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. సస్పెక్ట్ షీట్ ఉండడంతో సీపీ కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లి అతను ఉన్నాడా? లేడా అని మాత్రమే చెక్ చేయడం జరుగుతుందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.