అబ్దుల్లాపూర్‌మెట్ : గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్దఅంబర్‌పేట-కొహెడ సర్వీస్ రోడ్డు వెంట ఉన్న కాలువలో మహిళ మృతదేహం తెలుతూ స్థానికులకు శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ వీరభద్రం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కాలువ నీటిలో ఉన్న సదరు మహిళా మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఆమె వంటిపై నలుపు రంగు టీ షర్ట్, తెలుపు గీతలు ఉన్న ప్యాంట్, కాళ్లకు మెట్టెలు, చేతికి రెండు ఆకుపచ్చ గాజలు ఉన్నాయని వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.