ముంబై: నర్సింగ్‌హోమ్‌లో పనిచేసే స్వీపర్, రెండేండ్ల బాలుడికి తప్పుడు ఇంజక్షన్ వేసింది. దీంతో ఆ చిన్నారి నిమిషాల్లోనే చనిపోయాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. తాహా ఖాన్ అనే రెండేండ్ల బాలుడికి జ్వరం వచ్చింది. దీంతో ఆ చిన్నారి పేరెంట్స్, గోవండి బైగన్వాడిలోని నూర్ నర్సింగ్ హోమ్‌లో అడ్మిట్ చేశారు. కాగా, నర్సింగ్ హోమ్ డాక్టర్ బయటకు వెళ్తూ 16 ఏండ్ల మరో రోగికి అజిత్రోమైసిన్ ఇంజక్షన్ ఇవ్వాలని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌కు చెప్పాడు. దీంతో 16 ఏండ్ల బాలుడికి ఆ ఇంజక్షన్ వేయమని నర్స్‌తో అతడు అన్నాడు.
అయితే రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని ఆ నర్సు వినిపించుకోలేదు. అయితే తాను ఇంజక్షన్ చేస్తానని అక్కడున్న స్వీపర్ నర్సుతో అన్నది. ఆమె సరే అనడంతో 16 ఏండ్ల బాలుడికి బదులు రెండేండ్ల బాలుడికి ఆ ఇంజక్షన్ వేసింది. దీంతో ఆ బాలుడు నిమిషాల్లోనే మరణించాడు.
దీంతో నర్సింగ్ హోమ్ నిర్లక్ష్యంపై బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 17 ఏండ్ల మహిళా స్వీపర్, నర్సు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.