కాటారం : ఇసుక లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దగ్దమైన ఘటన మండల కేంద్రంలోని 353 (సీ) జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్02యూబీ9986 నంబర్ గల ఇసుక లారీ ఇసుక లోడ్‌తో మహాదేవపూర్ నుంచి కాటారం వైపు వస్తున్న క్రమంలో బావని వాగు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు కిందకి దూసుకెళ్లి బోల్తాపడింది.
ఈ క్రమంలో విద్యుత్ వైర్ తెగి లారీకి తగలడంతో విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించి ఇసుక లారీ దగ్దమైంది. అయితే లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీనివాస్ పరిశీలించారు.