Yash Toxic Movie | కన్నడ స్టార్ హీరో యష్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా విడుదలైనప్పటి నుంచే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తుండటంతో, చిత్ర యూనిట్ చర్యలకు ఉపక్రమించింది. సినిమాపై ప్రతికూల సమీక్షలు, సోషల్ మీడియాలో తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని అడ్డుకోవడానికి మేకర్స్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన పలువురు ప్రముఖ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చిత్ర నిర్మాతల తరఫున లీగల్ నోటీసులు అందాయి.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఎక్కువశాతం నెగెటివ్ రివ్యూలే రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లు భారీగా తగ్గాయి. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజుకు గణనీయంగా పడిపోయాయి. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది.
సినిమా విడుదల కావడానికి ముందే, బెంగళూరు కోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాతలు ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’, ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంస్థలు కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు (Interim Injunction) పొందాయి. ఈ సినిమాపై ఎలాంటి తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించకూడదని, ప్రచారం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే, బెంగళూరుకు చెందిన ‘ఐప్లెక్స్ సాఫ్ట్వేర్’ అనే సంస్థ చిత్ర నిర్మాతల తరఫున ఆన్లైన్ కంటెంట్‌ను పరిశీలిస్తూ చర్యలు చేపట్టింది.
ఇక సినిమా రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ సూరజ్ కుమార్ వీడియోకు లీగల్ నోటీసు అందిందని సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. తమిళ యూట్యూబర్ ప్రశాంత్ రంగస్వామి మరియు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తమకు చిత్ర యూనిట్ నుంచి కోర్టు/లీగల్ నోటీసులు అందాయని ధృవీకరించారు. అయితే, నిర్మాతల ప్రతినిధులు పంపిన ఈ నోటీసులు కేవలం ఆన్లైన్ కంటెంట్ తొలగింపునకు సంబంధించిన కమ్యూనికేషన్ మాత్రమేనని, కోర్టు ద్వారా రివ్యూలను తొలగించాలనే తుది తీర్పు ఇంకా వెలువడలేదని తెలుస్తుంది.