వ్యవస్థ (వెబ్‌సిరీస్)
జీ5: ఏప్రిల్ 28
తారాగణం: కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్, సందీప్ రాజ్, కామ్నా జెఠ్మలానీ
దర్శకత్వం: ఆనంద్ రంగం
కోర్టు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. ‘వ్యవస్థ’ కూడా అలాంటి కథే! యామిని, అజయ్ భార్యాభర్తలు. మొదటిరాత్రి యామిని తన భర్తను కాల్చి చంపుతుంది. ఆ కేసు నుంచి తనను బయటపడేయాల్సిందిగా సీనియర్ లాయర్ అవినాశ్ చక్రవర్తిని కోరుతుంది. అయితే, కేసు కోర్టుకు వచ్చాక తనకు లాయర్‌ను మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరుతుంది యామిని. ఆ కేసును జూనియర్ లాయర్ వంశీ కృష్ణకు అప్పగిస్తుంది.
‘చెక్‌మేట్’ పేరుతో సంస్థను నెలకొల్పి, ప్రతిభ ఉన్న న్యాయవాదులను తన గుప్పిట పెట్టుకున్న చక్రవర్తికి ఇది మింగుడుపడదు. వంశీకృష్ణ తన జూనియర్ కూడా కావడంతో ఆయన అహం దెబ్బతింటుంది. అజయ్ హత్య కేసులో వంశీకృష్ణను కూడా నిందితుడిగా నిలబెడతాడు. అసలు అజయ్‌ను హత్య చేసింది ఎవరు? ఎందుకు చంపారు? యామినికి, వంశీకి ఉన్న సంబంధం ఏమిటి? వంశీ విషయంలో చక్రవర్తి ఎందుకంత తీవ్రంగా స్పందిస్తాడు? సిరీస్ మొత్తం చూస్తే గానీ.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. కథ, కథనం నిదానంగా సాగినా.. కోర్టు సీన్లు ఆకట్టుకుంటాయి.