Waltair Veerayya | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. కానీ విశాఖ పోలీసులు చిరంజీవికి, ఆయన అభిమానులకు షాకిచ్చారు. ఈవెంట్‌కు సంబంధించిన సగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేదని విశాఖ సీపీ తేల్చిచెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఏం చేయాలో తెలియక నిర్వాహకులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతికి పండక్కి వస్తుండటంతో బాస్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లుక్.. పాత చిరంజీవిని గుర్తుకు తెస్తున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. పైగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.