Vishwak Sen | ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతుంటాడు విశ్వక్ సేన్. ఈయనకు టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. మీడియం రేంజ్ హీరోగా ఎదిగే ఛాన్స్ కూడా ఉంది. మంచి మాస్ ఫాలోయింగ్‌తో ఓపెనింగ్స్ కూడా తెస్తుంటాడు విశ్వక్. అందుకే విశ్వక్‌ను మాస్ కా దాస్ అంటుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘దాస్ కా ధమ్కీ’ లాంటి సినిమాలతో ఈయన మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈ జనరేషన్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత వేగంగా మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్న హీరో ఈయనొక్కడేనేమో..?
హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చూపించాడు విశ్వక్ సేన్. ఫలక్నుమాస్ దాస్, ధమ్కీ లాంటి సినిమాలు ఈయనకు డైరెక్టర్‌గానూ గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అవ్వడం ఈ హీరో స్టైల్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. అదేంటి అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు మనోడు అనౌన్స్ చేసిన ఓ సినిమా టైటిల్ దగ్గరే అసలు రచ్చ మొదలైంది. తాజాగా కల్ట్ అనే సినిమాను తన నిర్మాణంలో ప్రకటించాడు విశ్వక్ సేన్. అందులో ఆయన హీరో కాదు.. నిర్మాత మాత్రమే. మరో హీరోతో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు విశ్వక్ సేన్.
దీనికి ఆయనే కథను అందించడంతో పాటు నిర్మిస్తున్నాడు కూడా. తాజుద్దీన్ అనే దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఇందులో అంతా కొత్తవాళ్లే నటిస్తారని చెప్పుకొచ్చాడు విశ్వక్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో నటించాలనుకున్న వాళ్లు మెయిల్ ఐడీకి పంపాలని ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు ఈ హీరో. అయితే ‘కల్ట్’కు దగ్గరగా ఉన్న పేరుతో మరో టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయింది. 2023 సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ని నిర్మించిన SKN తన నెక్ట్స్ సినిమాకు ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడు. తాజాగా విశ్వక్ ‘కల్ట్’ పేరుతో సినిమాను ప్రకటించడం వివాదానికి దారి తీస్తుంది. నిజానికి బేబీ టీమ్‌తో గతంలోనే విశ్వక్ సేన్‌కు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అప్పట్లో తన సినిమా కథను విశ్వక్ సేన్ కనీసం వినకుండా నో చెప్పాడని బేబీ దర్శకుడు సాయి రాజేష్ చెప్పాడు.
ఆ తర్వాత ‘బేబీ’ డైరెక్టర్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసాడు. ఓ సినిమాకు నో అంటే నో అని.. కూల్‌గా ఉండాలని, అరిచి గోల చేయొద్దని అందులో రాసుకొచ్చాడు. తనకు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ ఉన్నపుడు కథ వినకుండానే నో చెప్పానని.. అనవసరంగా కథ విన్నాక నో చెప్పి దర్శకుడి టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. అంతలోనే ఇప్పుడు కల్ట్ అంటూ టైటిల్ ప్రకటించడంతో మరో వివాదం మొదలైంది. మరోవైపు నిర్మాత ఎస్కేఎన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ముందుగానే తన సినిమా టైటిల్ రిజిష్టర్ చేయించాను కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆలోచించాలని చెప్పుకొచ్చాడు. చూడాలిక.. ఈ కాంట్రవర్సీ ఎలాంటి వైపు వెళ్తుందో..?