Vishwaksen | వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకుడు. రాకేష్ వర్రే నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం కథానాయకుడు విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘రాకేష్ యాక్టర్‌గా నటిస్తూనే నిర్మాతగా మారడం ఆనందంగా వుంది. ఈ చిత్రం టీజర్ బాగుంది. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. కథ చెబుతానంటే నేను టైమ్ ఇవ్వలేదు.. వినలేదని ఇటీవల నాపై కొన్ని మీమ్స్ వచ్చాయి. .
గంట సేపు ఓ మనిషిని కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలైన ఆ చిత్రం పెద్ద హిట్ అయితే ఆనందించాను. ఆ సినిమా నేను చేయాలి కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవొద్దు. అదొకటి నాకు బాధగా అనిపించింది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమా కోసం వర్క్‌షాప్ చేశాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అందరిని ఎంటర్టైన్ చేస్తుంది’ అన్నారు.