Vijai Bulganin | సినిమాల్లోకి రాకముందే తన మ్యూజిక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు, గాయకుడు విజయ్ బుల్గానిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండిపెండెంట్‌గా రూపొందించిన పలు పాటలతో మ్యూజిక్ లవర్స్‌కు దగ్గరైన ఆయన.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ‘బేబీ’ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే విజయ్ బుల్గానిన్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇండిపెండెంట్ సాంగ్స్‌లో ‘కోయిలా’ ఒకటి. అలేఖ్య హారిక, వినయ్ షణ్ముఖ్ తదితరులతో కలిసి రూపొందించిన ఈ పాట అప్పట్లో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని విజయ్ బుల్గానిన్ వెల్లడించారు.
‘కోయిలా’ పాటను మొదట స్వతంత్రంగా విడుదల చేయాలనే ఆలోచనతో రూపొందించలేదట. ఈ పాటను సినిమాల్లో ఉపయోగించాలనే ఉద్దేశంతో ముగ్గురు, నలుగురు దర్శకులకు వినిపించినట్లు విజయ్ బుల్గానిన్ తెలిపారు. అయితే ఆ దర్శకుల్లో ఎవరూ ఈ పాటను తమ సినిమాల్లో తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో కొంత నిరాశకు గురైనప్పటికీ.. చివరికి పాటను ఇండిపెండెంట్‌గా విడుదల చేయాలని విజయ్ బుల్గానిన్, ఆయన టీమ్ నిర్ణయించుకుంది.అదే నిర్ణయం ఆ తర్వాత వారికి భారీ విజయాన్ని అందించింది. సినిమా కోసం దర్శకులు ఎంపిక చేయకపోవడంతో ‘కోయిలా’ను స్వతంత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ పాట విడుదలైన తర్వాత మ్యూజిక్ లవర్స్ నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.
ప్రేమ, అందమైన విజువల్స్, ఆకట్టుకునే సంగీతం, వినయ్ షణ్ముఖ్ క్రియేటివ్ ప్రజెంటేషన్, అలేఖ్య హారిక స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా పాటకు సంబంధించిన ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా ‘కోయిలా’ భారీ ఇండిపెండెంట్ హిట్‌గా నిలిచింది.ప్రస్తుతం ఈ పాట 78 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. అంటే దాదాపు 7.8 కోట్లకు పైగా వ్యూస్ అందుకుని యూట్యూబ్‌లో సత్తా చాటింది.విజయ్ బుల్గానిన్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అప్పట్లో ఆ ముగ్గురు, నలుగురు దర్శకుల్లో ఎవరైనా ‘కోయిలా’ పాటను తమ సినిమాలో పెట్టుకుని ఉంటే.. అది ఆ సినిమాకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉండేది. కానీ పరిస్థితులు మరోలా మారాయి. దర్శకుల రిజెక్షన్ కారణంగానే పాట ఇండిపెండెంట్‌గా విడుదలైంది. దీంతో ఏదైనా ఒక సినిమా లేదా హీరోపై ఆధారపడకుండా ‘కోయిలా’కు సొంత ఆడియన్స్ ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ సమయంలో ఎదురైన రిజెక్షన్లే విజయ్ బుల్గానిన్‌కు మరో పెద్ద విజయాన్ని అందించాయి.