Anupam Kher | బహుముఖ నటుడు అనుపమ్ ఖేర్ రాబోతున్న చిత్రం ‘కుచ్ ఖట్టా హో జాయ్’. ఇది ఆయనకు 540వ సినిమా. ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ నటుడిగా తన 40 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్లో అనేక అంతర్జాతీయ చిత్రాలు చేశాను. ఆ క్రమంలో పలు విమర్శలు ఎదుర్కొన్నాను. ప్రేక్షకులు విసిరిన రాళ్లతో నిర్మించుకున్న కోట నా జీవితం’ అని చెప్పారు అనుపమ్.
తన కెరీర్ హెచ్చుతగ్గుల గురించి చెప్తూ.. ‘ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే జీవితంలోని ఆనందం అర్థమవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగితే అది ప్రయాణమే కాదు. కష్టాలు ఉండాలి. ఎత్తు పల్లాలు ఉండాలి.. అప్పుడే జీవితాన్ని ఆస్వాదిస్తాం. 1981లో కేవలం 37 రూపాయలతో ఈ నగరానికి వచ్చాను. ఈ రోజు నా 540వ చిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇంత కన్నా ఆ దేవుడిని ఏం అడగాలి?’ అన్నారు. జి.అశోక్ దర్శకత్వం వహించిన ‘కుచ్ ఖట్టా హో జాయ్’ ఈ నెల 16న విడుదల కానున్నది.