Venu Udugula | వెండితెరపై నిండుగా పరిఢవిల్లుతున్న తెలంగాణ జీవన సౌందర్యం: దర్శకుడు వేణు ఉడుగుల
Venu Udugula | విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు ఆలంబనగా నిలిచిన వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదిగారు వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో పరిశ్రమలో తనదైన ముద్రవేశారు.
Venu Udugula | విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు ఆలంబనగా నిలిచిన వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదిగారు వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. ఆయన ప్రతీ మాటలో తెలంగాణ పట్ల అంతులేని మమకారం కనిపిస్తుంది. అవమానాలు, అవహేళనలతో తీవ్ర విస్మరణకు గురైన తెలంగాణ.. నేడు కేసీఆర్ నాయకత్వంలో పునర్వికాసం సాధిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవన సౌందర్యం వెండితెరపై నిండుగా పరిఢవిల్లుతున్నదనీ, తెలంగాణ సినిమాకు ఇది మేలు మలుపనీ అభివర్ణించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు వేణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాకముందు మన యువత ఆత్మన్యూనతతో బాధపడేది. హైదరాబాద్‌లో ఆ భావన మరింత కనిపించేది. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత అదే యువతలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. సినిమా పరిశ్రమ విషయానికొస్తే గతంలో పల్లెటూరు అనగానే కోనసీమనే చూపించేవారు. పండగ అంటే సంక్రాంతే అన్నట్టుండేది. తెలుగు ప్రజలంతా అదే తమ సంస్కృతి అనుకునేవారు. తెలంగాణ ఆవిర్భావం ఆ భ్రమల్ని పటాపంచలు చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలోనే అతిగొప్ప రాజకీయ నిర్ణయం. మరుక్షణం నుంచే ఇక్కడి జీవితాన్ని, సంస్కృతిని అన్ని రంగాలూ గుర్తించడం ఆరంభమైంది. సినిమాల్లో తెలంగాణ యాసకు మార్కెట్ ఏర్పడింది. విరాటపర్వం, దసరా, బలగం తదితర సినిమాలు తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని తెరపై గొప్పగా ఆవిష్కరించాయి. సల్మాన్‌ఖాన్ ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ చిత్రంలో బతుకమ్మ పండగ మీద పాట తీశారంటే జాతీయ స్థాయిలో తెలంగాణ సంస్కృతికి వచ్చిన గుర్తింపును అర్థం చేసుకోవచ్చు.
సాంస్కృతిక విజయం
కేసీఆర్ తన రాజీలేని పోరాటంతో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. ఆ తర్వాతే తెలంగాణ జాతి బలం, ఇక్కడి ఆచార వ్యవహారాల ఔన్నత్యం, పండగల ప్రాశస్త్యం ప్రపంచానికి తెలిసొచ్చింది. అంతకు ముందు మన భాష, యాస, ఆహారపు అలవాట్లు అవహేళనకు గురయ్యాయి. ఏ యాసనైతే కమెడియన్స్‌కు, విలన్స్‌కు పెట్టి అపహాస్యం చేశారో.. అదే యాసలో మాట్లాడటానికి అగ్రహీరోలు కూడా ఉబలాటపడుతున్నారు. ఆధిపత్య భావజాలంపై సాధించిన సిసలైన సాంస్కృతిక విజయమిది. తెలంగాణ సినిమా విజయాల వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల కథలు కూడా విరివిగా తెరపై ఆవిష్కృతం అవుతున్నాయి. ఓ రకంగా విస్మరణకు గురైన భిన్న ప్రాంతాల అస్తిత్వాన్ని, మట్టికథలను వెండితెరపై తీసుకొచ్చేందుకు తగినంత ప్రేరణనిచ్చింది తెలంగాణ సినిమా.
మన కథల్ని చూసుకుంటున్నాం
తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడి ప్రజలు మార్క్సిస్టు, అస్తిత్వ ఉద్యమాలతో కలిసి ఎదిగారు. ఆకలి, అవమానాలతో పాటు పోరాటాన్నీ జీవితంలో భాగం చేసుకున్నారు. తెలంగాణ.. ఓ రాజకీయ ప్రయోగశాల కూడా. దీనివల్ల మన దర్శకుల జీవన దృక్కోణం.. మిగతా వారికంటే భిన్నంగా ఉంటున్నది. తమ సంస్కృతి, ఉనికి పట్ల వారిలో ఓ ఆర్తి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనవైన కథల్ని, పండగల్ని, చావు తాలూకు వ్యథల్ని కూడా తెరపై చూసుకుంటున్నాం.
ఎక్కడ చూసినా పచ్చదనమే
పదేండ్ల్ల క్రితం డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ కోసం మహబూబ్‌నగర్ వెళ్లినప్పుడు నెర్రెలు చాచిన నేలలు కనిపించాయి. పచ్చదనం మచ్చుకైనా లేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో కనుచూపు మేరా పచ్చదనమే. తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. రైతుబంధు పథకం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే బాగుంటుంది. అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తే రైతు దశే మారుతుంది.
సింహా అవార్డులు ఇవ్వాలి
తెలంగాణ ఇతివృత్తాలతో తీసే చిన్న చిత్రాలకు ఎఫ్డీసీ నుంచి ఆర్థిక సహాయం అందిస్తే మరిన్ని లోకల్ కథలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే తెలంగాణ యాసలో టైటిల్స్ పెట్టుకునే సినిమాలకు సబ్సిడీ ప్రకటిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత కొంతకాలంగా ప్రభుత్వ పరంగా సినిమా అవార్డులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ‘సింహా’ పేరుతో అవార్డులను ప్రదానం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

కేటీఆర్ యువతకు స్ఫూర్తి
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రగతి కనిపిస్తున్నది. పల్లె మొదలుకొని పట్టణాలన్నీ కొత్తరూపును సంతరించుకున్నాయి. ఇక హైదరాబాద్ అభివృద్ధి వాయువేగంతో జరుగుతున్నది. దుర్గం చెరువు వంతెన నుంచి చూస్తే మన హైదరాబాద్ న్యూయార్క్ నగరాన్ని తలపిస్తున్నది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు వెళ్తే విదేశాల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతున్నది. కేటీఆర్ రాజధాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రసంగాలు, ఆయనలోని నాయకత్వ లక్షణాలు లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి.
…? కళాధర్ రావు జూలపల్లి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

