Veerabhadrudu Review | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’). అనేక ఆర్థికపరమైన వివాదాలు, హైడ్రామా నడుమ మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా, మే 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ఒక వైపు దైవత్వం, మరోవైపు న్యాయవ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే ఒక భిన్నమైన కమర్షియల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే లాయర్ సామ్రాజ్యం నడుస్తుంటుంది. లాయర్లనే కాకుండా అక్కడి జడ్జి (నట్టి సుబ్రమణియన్)ని సైతం తన గుప్పెట్లో పెట్టుకుని, డబ్బు బలంతో తనకు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా.. తమిళనాడు నుంచి మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) తన కుమార్తె మీను (అనఘా మాయా రవి) లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం తెచ్చుకున్న 60 సవర్ల బంగారం నాంపల్లి జంక్షన్లో దొంగతనానికి గురవుతుంది. పోలీసులు అందులో 45 సవర్లు రికవరీ చేసినప్పటికీ, ఆ బంగారాన్ని కోర్టు నుంచి ఇప్పిస్తానని చెప్పి బేబీ కృష్ణ ఆ పేద కుటుంబాన్ని చుట్టూ తిప్పుకుంటూ డబ్బులు గుంజేస్తుంటాడు. బేబీ కృష్ణ మోసాలకు విసిగిపోయిన మునిస్వామి, కోర్టు ఆవరణలోని క్షేత్ర పాలకుడైన వీరభద్రుడిని వేడుకుంటాడు.
ఆ క్షణంలోనే లాయర్ రూపంలో క్షేత్ర పాలకుడు వీరభద్రుడు (సూర్య) రంగప్రవేశం చేస్తాడు. ఈ క్రమంలో బేబీ కృష్ణ.. వీరభద్రుడికి ఒక సవాల్ విసురుతాడు. భగవంతుడిగా తన శక్తులను ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం ఒక సాధారణ లాయర్‌గా ఈ కేసులో గెలిచి చూపించాలని సవాల్ చేస్తాడు. మరి ఈ లీగల్ బ్యాటిల్లో వీరభద్రుడు ఏం చేశాడు? మీను జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ కథలోకి ప్రీతి (త్రిష) పాత్ర ఎలా ప్రవేశించింది? చివరికి న్యాయం ఎలా గెలిచింది? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ
దర్శకుడు ఆర్జే బాలాజీ కమర్షియల్ అంశాలతో పాటు సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఒక బలమైన కథను ఎంచుకోవడంలో సఫలమయ్యారు. అయితే, స్క్రీన్‌ప్లే పరంగా ఆయన చేసిన కొన్ని తప్పులు సినిమాకు మైనస్‌గా మారాయి. సూర్య లాంటి స్టార్ హీరోను సవాల్ చేసే విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ స్వయంగా నటించారు. కానీ, నటుడిగా తన పాత్రకు ఎక్కువ ఎలివేషన్లు ఇచ్చుకోవడం, సినిమా ప్రారంభమైన 40 నిమిషాల వరకు హీరో ఎంట్రీ లేకపోవడం సూర్య అభిమానులను కాస్త నిరాశపరుస్తుంది. న్యాయవ్యవస్థపై వేసిన సెటైర్లు అంతగా పేలకపోయినప్పటికీ, సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. సూర్యను క్షేత్ర పాలకుడిగా, దేవుడిగా చూపించిన విధానం థియేటర్లలో ప్రేక్షకులకు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
సాంకేతికంగా
సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన బలం. వీరభద్రుడు స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. అయితే, పాటల్లో తెలుగు డబ్బింగ్ లిరిక్స్ మిక్సింగ్ సరిగా కుదరకపోవడం వల్ల సాంగ్స్ అంతగా రిజిస్టర్ కావు. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ విజువల్స్‌ను రిచ్‌గా చూపించాయి. నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటర్ ఆర్ కలైవణ్ణన్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది.
నటీనటుల ప్రతిభ
నటుడిగా సూర్య మరోసారి వన్‌మెన్ షో చేశారు. క్షేత్ర పాలకుడిగా ఆయన చేసిన రుద్ర తాండవం, వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో లాయర్‌గా ఆయన లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ సీన్లో సూర్య నటన పీక్స్‌లో ఉంటుంది. అయితే, సూర్య ఇమేజ్ ముందు ఆర్జే బాలాజీ విలనిజం అంతగా పండలేదు. ఆ పవర్ఫుల్ పాత్రకు వేరే బలమైన నటుడిని పెట్టుకుంటే బాగుండేది. త్రిష తన పరిధి మేరకు కీలక పాత్రలో మెప్పించగా, ఇంద్రాన్స్, అనఘా రవి తమ ఎమోషనల్ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
సూర్య లుక్స్, క్లైమాక్స్ రుద్ర తాండవం
క్షేత్ర పాలకుడి ఎలివేషన్ సీన్స్
సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM)
ఎమోషనల్ కనెక్టివిటీ
మైనస్ పాయింట్స్
ఆర్జే బాలాజీ పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వడం
బలహీనమైన విలనిజం
ప్రథమార్థంలో సాగదీత
ముగింపు:
‘కాంతార’ క్లైమాక్స్ తరహాలోనే ఈ చిత్ర క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్జే బాలాజీ స్క్రీన్ టైమ్‌ను కాస్త భరించి, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే.. సూర్య వన్‌మెన్ షో కోసం ‘వీరభద్రుడు’ చిత్రాన్ని థియేటర్లలో హ్యాపీగా చూడొచ్చు.