Varun Dhawan | బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, స్టార్ హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ప్రముఖ సీనియర్ దర్శకుడు, వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరమైన కోర్టు సీన్‌తో మొదలవుతుంది. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ భార్యాభర్తలుగా నటిస్తుండగా, వరుణ్‌కు పిల్లలు కావాలని, కానీ మృణాల్ దానికి సిద్ధంగా లేకపోవడంతో వారు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన వరుణ్ ధావన్, అక్కడ పూజా హెగ్డేను కలుసుకుని ప్రేమలో పడతాడు. అయితే ఊహించని విధంగా అటు మృణాల్ ఠాకూర్, ఇటు పూజా హెగ్డే ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ కావడంతో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇలా ఇద్దరు మహిళల మధ్య ఇరుక్కుపోయిన వరుణ్ ధావన్, ఆ నిజం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఎలాంటి అబద్ధాలు ఆడాడు, ఎలాంటి గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథాంశం. ఇక ట్రైలర్‌తోనే మొత్తం కథను చెప్పేశాడు దర్శకుడు.
వరుణ్, మృణాల్, పూజాలతో పాటు మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రమేష్ తౌరానీ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.