S. Saraswathi OTT | బహుముఖ ప్రజ్ఞాశాలి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్. సరస్వతి’. గత నెల మార్చి 6న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో వరలక్ష్మితో పాటు ప్రకాశ్ రాజ్, ప్రియమణి, జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, రాధికా శరత్‌కుమార్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే, లక్ష్మి అనే ఓ అనాథ మహిళ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ తన కూతురు ‘ఎస్. సరస్వతి’ని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అయితే ఆగస్టు 15న తన కూతురిని స్కూల్లో దించి ఉద్యోగానికి వెళ్లిన లక్ష్మి.. ఆ తర్వాత తన కూతురు కనిపించడం లేదని, స్కూల్లోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తుంది. పోలీసులు విచారించగా అసలు అలాంటి పాపే ఆ స్కూల్లో లేదని తేలడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ పాప ఏమైంది, లక్ష్మి చెబుతున్నది నిజమా లేక ఇదంతా ఆమె భ్రమా అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సాగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.