అడవిలో కష్టపడటం అలవాటైంది!

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో శుభారంభం చేశారు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌తేజ్. పల్లెటూరి ప్రేమికుడి పాత్రలో జీవించి తొలి ప్రయత్నంలోనే అందరిని మెప్పించాడు. మంచి భవిష్యత్తు ఉన్న కథానాయకుడనే ప్రశంసలు పొందాడు. వైష్ణవ్‌తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకుడు. ఈ నెల 8న ప్రేక్షకులముందుకొస్తున్నది. ఈ సందర్భంగా తన ద్వితీయ సినిమా అనుభవాలు, అడవిలో జరిగిన షూటింగ్ ముచ్చట్లను పాత్రికేయులతో పంచుకున్నారు వైష్ణవ్‌తేజ్. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
రెండో సినిమాకే అరణ్యం నేపథ్యంలోని కథను ఎంచుకోవడం ఎలా అనిపించింది?
దర్శకుడు క్రిష్ ఈ కథ చెప్పినప్పుడు ‘కొండపొలం’ వెళ్లడం అనే అంశమే నన్ను బాగా ఆకట్టుకుంది. వర్షాభావ పరిస్థితుల్లో గొర్రెల కాపరులు నెలల పాటు మందలను వెంటేసుకొని అరణ్యంలో జీవనం సాగించడం (కొండపొలం వెళ్లడం) గొప్ప సాహసయాత్రగా అనిపించింది. క్రిష్ తెరపై కథను తీర్చిదిద్దిన విధానం, సినిమా ద్వారా ఆయన చెప్పాలనుకున్న తాత్వికత తప్పకుండా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా సినిమాలోని ఓ ఎపిసోడ్లో పులితో పోరాటం చేయడం ఎక్సైటింగ్ ఎలిమెంట్‌లా ఫీలయ్యాను. ఇందులో నేను పట్నం నుంచి పల్లెటూరు వచ్చి తండ్రితో పాటు అడవిలోకి కొండపొలం వెళ్లే రవీంద్రనాథ్ అనే యువకుడి పాత్రను పోషించాను.
కెరీర్ ఆరంభంలో హీరోలు రొమాంటిక్ సబ్జెక్ట్స్‌పై దృష్టిపెడతారు. అందుకు భిన్నంగా మీరు గ్రామీణ ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్నారెందుకని?
అలాంటిదేమీ లేదు. నా మూడో చిత్రం పట్టణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథతో తెరకెక్కుతున్నది. ‘కొండపొలం’ కథలో జీవనసందేశంతో పాటు పుష్కలమైన కమర్షియల్ అంశాలుంటాయి. తొలి రెండు చిత్రాల్లో నేను డీగ్లామర్ రోల్స్‌లో కనిపించినా..ఓ నటుడిగా అవి నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. నటనాపరంగా కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి దోహదపడ్డాయి.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అడవిలో బాగా కష్టపడ్డారని తెలిసింది?
దట్టమైన అడవిలో షూటింగ్ చేయడం వల్ల రోజు మూడునాలుగు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. టీమ్ అంతా షూటింగ్ సామాగ్రిని మోసుకుంటూ కొండలు గుట్టలు ఎక్కేవాళ్లం .తొలుత బాగా కష్టమనిపించినా.. క్రమంగా ఆ కష్టానికి అలవాటు పడిపోయాం. ఓ వారం తర్వాత షూటింగ్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టాం.
ఇంతకి ఈ సినిమా ద్వారా ఏలాంటి ఫిలాసఫీని చెప్పబోతున్నారు?
శూన్యం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి..అనేక ప్రతికూలతల్ని జయించి..శిఖరాన్ని ముద్దాడిన యువకుడి స్ఫూర్తిదాయక కథగా చెప్పుకోవచ్చు. గొర్రెలుకాసే యువకుడు అదే అడవిని సంరక్షించే ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారిగా రావడం గొప్ప సంకల్పానికి ప్రతీకలా అనిపిస్తుంది.
ఈ సినిమాలో పులితో చేసిన ఫైట్ హైలైట్‌గా ఉందని అంటున్నారు?
పులిబొమ్మను తయారు చేసి దానికి సాంకేతిక హంగులను జోడించి ఆ పోరాట ఘట్టాన్ని తీర్చిదిద్దారు. నిజంగా పులి నా ముందు ఉన్నట్లే ఊహించుకొని ఆ సన్నివేశాల్ని రక్తికట్టించే ప్రయత్నం చేశా. దర్శకుడు క్రిష్ పులి ఫైటింగ్ ఎపిసోడ్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఆ ఎపిసోడ్ బాగా రావడానికి ఆయన అందించిన సలహాలు కూడా కారణమయ్యాయి.
ఈ సినిమాలో మీ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ ఏమైనా నిర్వహించారా?
నా పాత్ర కోసం ఎలాంటి ముందస్తు కసరత్తులు చేయలేదు. షూటింగ్ లొకేషన్లోనే దర్శకుడు క్రిష్ సూచనల ప్రకారం నటించేవాణ్ణి. కొద్దిరోజుల గడిచాక పాత్రను పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకున్నా. నా శాయశక్తులా శ్రమించి పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశాను.
ఓ నటుడిగా ఈ సినిమా మీకు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది?
షూటింగ్ సందర్భంలో ప్రతిసారి సరిగ్గా చేయలేకపోతున్నానేమో అనే భావన కలిగేది (నవ్వుతూ). తొలి సినిమాతో పోల్చితే నటనలో కాస్త పరిణతి వచ్చిందనుకుంటున్నా. నా నటన ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి.
మీ అన్నయ్య సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది. ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతున్నారు?
అన్నయ్య పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ సెషన్స్ నడుస్తున్నాయి. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

