మెగా కోడలు ఉపాసన పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె పక్షులు, జంతువులు, పౌష్టికాహారం, ఆయుర్వేద పద్దతుల్లో వైద్యం గురించి ఇలా పలు రకాల సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. ఉపాసన షేర్ చేసే వీడియోలు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. మరోవైపు మనుషులతో పాటు మూగ జీవాలకు తన వంతు సాయం చేస్తూ ఉంటుంది.
తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు సింహాలను సంరక్షణ బాధ్యతలు.. ఆహారపు ఖర్చులను సంవత్సరంపాటు ఉపాసన కొణిదెల చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు.. జూలో సరైన పరిశుభ్రతను నిర్వహించడంలో సిబ్బంది అంకితభావం.. జంతువుల కోసం జూ నిర్వహకులు చేస్తున్న సేవకు వారిని ప్రశంసించారు.