Janhvi Kapoor | దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ హిందీ చిత్రసీమలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘బవాల్’ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్న ఆమె తన తొలి ప్రేమ అనుభవాల గురించి చెప్పింది. కొద్ది కాలంలోనే తమ బంధం ముగిసిపోవడానికి కారణమేమిటో తెలిపింది. ‘ఏమాత్రం పరిణితి లేని వయసు కావడంతో మేమిద్దరం ఓ కన్ఫ్యూజన్లో ఉండేవాళ్లం.
ప్రేమలో ఇద్దరం నిజాయితీగా లేమని, అబద్దాలతోనే బంధాన్ని కొనసాగిస్తున్నామని తెలుసుకున్నాం. అదే సమయంలో నా పేరెంట్స్ కూడా చదువు మీద దృష్టి పెట్టాలని గట్టిగా మందలించారు. వారు చెప్పినట్లుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దాంతో ఆ ఆబ్బాయితో తెగతెంపులు చేసుకున్నా’ అని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. అయితే తాను ప్రేమించిన అబ్బాయి గురించి కానీ, ఆ సమయంలో తన వయసు గురించి కానీ జాన్వీకపూర్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం జాన్వీకపూర్ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.