Trimukha | నేడు (జనవరి 30) థియేటర్లలో విడుదలైన చిత్రం ‘త్రిముఖ’. యోగేష్ కల్లె, సన్నీ లియోన్, ఆకృతి అగర్వాల్ మరియు ‘సిఐడి’ ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రాజేష్ నాయుడు దర్శకత్వంలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
కథ
నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. మూడు ముఖాలు ఉన్న మాస్క్ ధరించిన ఒక ఆగంతకుడు ఈ ఘోరాలకు పాల్పడుతుంటాడు. ఈ కేసును ఛేదించే బాధ్యత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని రాథోడ్ (సన్నీ లియోన్) పై పడుతుంది. మరోవైపు, ఆత్మలు, దయ్యాలు వంటివి మూఢనమ్మకాలని నమ్మే డాక్టర్ యోగి (యోగేష్ కల్లె), ఒక హాంటెడ్ హౌస్ మిస్టరీని ఛేదిస్తాడు. అతని ప్రతిభను చూసిన ప్రొఫెసర్ (ఆదిత్య శ్రీవాస్తవ), ఆత్మలకు సంబంధించిన మూడు క్లిష్టమైన కేసులను పరిష్కరించమని యోగికి ఛాలెంజ్ విసురుతాడు. అసలు ఆ మూడు కేసులు ఎవరివి? మాస్క్ వెనుక ఉన్న హంతకుడు ఎవరు? యోగి తన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు రాజేష్ నాయుడు ఒక రెగ్యులర్ మర్డర్ మిస్టరీకి విభిన్నమైన స్క్రీన్ ప్లే జోడించి కొత్తగా ప్రయత్నించారు.
ఫస్ట్ హాఫ్ లో యోగి చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకృతి అగర్వాల్‌తో వచ్చే పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద అంచనాలను పెంచుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి, రెండో భాగం (Part 2) కోసం లీడ్ ఇవ్వడం విశేషం. ఫ్లాష్ బ్యాక్ సీన్లలో AI (Artificial Intelligence) విజువల్స్ వాడటం ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కథ రెండు ట్రాక్ లపై (యోగి ఇన్వెస్టిగేషన్ & సన్నీ లియోన్ కేసు) ఒకేసారి సాగడం వల్ల ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది.
నటీనటుల ప్రతిభ:
హీరోగా యోగేష్ కల్లె తన పాత్రకు న్యాయం చేశారు. సన్నీ లియోన్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించినా, ఆమె పాత్రను ఇంకా పవర్ ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఆదిత్య శ్రీవాస్తవ తన అనుభవంతో కథకు బలాన్నిచ్చారు. అషురెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సుమన్, రవి ప్రకాష్ వంటి సీనియర్ నటుల ఉనికి సినిమాకు ప్లస్ అయ్యింది.
సాంకేతిక విభాగం:
నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా వరకు రాత్రి వేళల్లో సాగినా విజువల్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల హెవీగా అనిపించినా, పాటలు మాత్రం శ్రోతలను అలరిస్తాయి.
చివరిగా: ‘త్రిముఖ’.. మర్డర్ మిస్టరీలను ఇష్టపడే క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు ఒక వైవిధ్యమైన ప్రయత్నం. కొన్ని కన్ఫ్యూజన్లను పక్కన పెడితే, ఈ వీకెండ్ లో థ్రిల్ ఇచ్చే చిత్రమిది.