తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ మూవీ ‘త్రికాల’. ‘ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. దర్శకుడు మణి తెల్లగూటి కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను ఒకే కథలో మిళితం చేసి ఈ విజువల్ వండర్‌ను ఆవిష్కరించారు. టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ‘తుంబాడ్’, ‘కాంతార’ తరహా డార్క్ మిస్టిక్ ప్రపంచాన్ని గుర్తు చేసింది. చాగంటి ప్రొడక్షన్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు పూర్తి సమీక్షలో తెలుసుకుందాం.
కథ
శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడి మునులు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ రహస్యాలను కాపాడేందుకు “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు ‘త్రికాల వర్మ’కు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు.
ప్రస్తుత కాలంలో శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర ఒక దుష్టశక్తి ఆవహించిన మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, నిజానికి పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. కుటుంబ కలహాలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. మరోవైపు అసుర రాజు తిరిగి భూమిపై ఆధిపత్యం సాధించేందుకు మేల్కొంటాడు. అప్పుడు దర్వాడి తాంత్రిక తెగ ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి, త్రికాలవర్మ ఆత్మను తిరిగి ఎలా మేల్కొలిపింది? శివకు ఈ కథతో ఉన్న అసలు సంబంధం ఏమిటి? చివరకు అసుర శక్తులపై దైవశక్తి ఎలా విజయం సాధించింది? అనేదే సినిమా అసలు కథ.
విశ్లేషణ
‘త్రికాల’ సినిమాలో అత్యంత బలమైన అంశం దాని కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగుల రూపంలోనే కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాలో ప్రధాన బలంగా నిలిచింది.
నటీనటుల అద్భుత నటన:
అజయ్ వైతరణ్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి.. మానసిక ఒత్తిడి, అంతర్మథనం, భయం, దుష్టశక్తి మధ్య చిక్కుకున్న పాత్రలో అజయ్ అద్భుతంగా నటించారు. అతని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్, డార్క్ విజువల్ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉన్నాయి. మాస్టర్ మహేంద్రన్ హీరోగా ఈ సినిమాలో చాలా సహజమైన నటనను కనబరిచారు. అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా విభిన్నమైన ఎమోషన్స్‌ను ఎంతో ఈజ్‌తో పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది. శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్‌గా నిలిచారు. తన పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక స్పెషల్ డార్క్ టోన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి ఆమని పాత్ర కూడా కథకు ఎంతో కీలకం. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను చాలా సహజంగా చూపించారు. ఆమె పాత్ర కథలో ఎమోషనల్ వెయిట్‌ను పెంచింది.
సాంకేతిక విభాగం:
తెలుగు సినీ పరిశ్రమలో మణి తెల్లగూటి పేరు ఒక “టెక్నికల్ ఫిల్మ్ మేకర్”గా వినిపించడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ దర్శకులు షూటింగ్ పూర్తయిన తర్వాత VFX గురించి ఆలోచిస్తే, మణి మాత్రం కథ రాసే దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. ‘త్రికాల’లో ప్రతి షాట్‌కు ఒక ప్రత్యేకమైన “డార్క్ విజువల్ లాంగ్వేజ్” ఉంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకలాజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు ఆయన ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీ సెట్లు లేకపోయినా, ఫ్రేమ్ కంపోజిషన్, డిజిటల్ ఎక్స్టెన్షన్స్, CGI బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడం దర్శకుడి ప్రధాన బలం. చాలా సన్నివేశాల్లో “హాలీవుడ్ డార్క్ ఫాంటసీ” తరహా విజువల్ టోన్ కనిపిస్తుంది.
పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్:
సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ స్టైల్‌ను తీసుకొస్తున్న సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు. ఈ సినిమాలో ఆయన కెమెరా పనితనం విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డార్క్ ఇంక్-బ్లాక్ టోన్స్ మధ్య గోల్డెన్ లైట్ బీమ్స్ ఉపయోగించడం వల్ల సినిమాలో ఒక మిస్టిక్ ఫీల్ వచ్చింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపించేలా కంపోజ్ చేయడం సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో కెమెరా మూమెంట్స్ చాలా స్లోగా, ఉత్కంఠను రేకెత్తించేలా డిజైన్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దాంతో పాటు షాజిత్ హుమాయున్ (SHAJITH HUMAYUN) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా హారర్, తాంత్రిక సీన్లలో BGM భయాన్ని మరింత పెంచింది. ఈ సినిమాలో VFX చాలా కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్.. ఇలా విజువల్స్ అన్నీ రిచ్‌గా కనిపిస్తాయి. CGIని అతిగా కాకుండా కథలో భాగంలా ఉపయోగించడం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే VFX సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.
నిర్మాణ విలువలు:
నిర్మాత రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. సెట్స్, కాస్ట్యూమ్స్, VFX, కలర్ టోన్, టెక్నికల్ స్టాండర్డ్స్.. అన్నీ కలిపి సినిమాకు హై బడ్జెట్ థియేట్రికల్ ఫీల్ తీసుకొచ్చాయి. కొత్త కాన్సెప్ట్‌లను నమ్మి ఇలాంటి విజువల్ డ్రివెన్ సినిమాను నిర్మించడం నిర్మాత అభిరుచిని చూపిస్తుంది.
ముగింపు:
‘త్రికాల’ రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథాలజీ, సైకలాజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్ల చక్కని మేళవింపు. పౌరాణిక రహస్యాలు, ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్, హాలీవుడ్ తరహా డార్క్ విజువల్ అనుభూతిని ఇష్టపడే ప్రేక్షకులకు ‘త్రికాల’ థియేటర్లలో ఒక సరికొత్త, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
రేటింగ్: 3 / 5