Kajol | బాలీవుడ్ చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంది సీనియర్ కథానాయిక కాజోల్. ఆమె నటించిన ‘ట్రయల్’ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యువ కథానాయికలు ప్లాస్టిక్ సర్జరీలను దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది కాజోల్. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడని, ఆ రూపాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమని ఆమె అభిప్రాయపడింది.
కాజోల్ మాట్లాడుతూ ‘కెరీర్ తొలినాళ్లలో నా రూపం, శరీర ఛాయపై ఎన్నో విమర్శలొచ్చాయి. కానీ నేనెప్పుడూ కుంగిపోలేదు. ప్లాస్టిక్ సర్జరీల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాకు నటనాపరంగా పరిణితి కనబరిచాను. అందుకే అగ్ర నాయికగా ఎదిగాను. నేటి తరం నాయికలు కూడా అందం కంటే ప్రతిభను నమ్ముకుంటే తప్పకుండా రాణిస్తారు. అన్నింటికంటే దేవుడు ప్రసాదించిన రూపమే మనలను ప్రత్యేకంగా నిలబెడుతుంది’ అని పేర్కొంది.