నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈచిత్రం సెప్టెంబర్ 18న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ ఏడాది మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్‌కి వెళ్లిన సినిమాలు మూడు.
వాటిలో ‘దురంధర్’ ఒకటైతే.. సల్మాన్‌ఖాన్ సినిమా రెండోది. మూడోది ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్న ఐడియా, ఎఫర్ట్‌ను చూడండి. అద్భుతమైన సినిమా తీశాం’ అని హీరో నిహాల్ చెప్పారు. గర్వపడే సినిమా చేశామని, టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు అక్కి విశ్వనాథ్‌రెడ్డి నమ్మకం వ్యక్తంచేశారు. ఇంకా నటి శాన్వి, బీవీఎస్ రవి, కమల్ కామరాజు, సూర్య శ్రీనివాస్, దీక్షా పంత్, హర్షిత, శ్రీష కూడా మాట్లాడారు.