Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యష్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. అయితే థియేటర్లలో మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందనే టాక్ వచ్చింది. ఇప్పుడు అదే ప్రభావం ‘టాక్సిక్’ డిజిటల్ రైట్స్‌పై పడినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విడుదలకు ముందు భారీ మొత్తంలో ఓటీటీ సంస్థలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ.. సినిమా ఫలితం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘టాక్సిక్’పై విడుదలకు ముందు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సుమారు రూ.150 కోట్ల ఆఫర్ చేసినట్లు సమాచారం. యష్ క్రేజ్‌తో పాటు సినిమాకు ఉన్న భారీ బజ్, టీజర్లో కనిపించిన బోల్డ్ కంటెంట్, స్టార్ హీరోయిన్ల గ్లామర్ వంటి అంశాలు ఈ ఆఫర్‌కు కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ ఆఫర్‌ను మేకర్స్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో సినిమా భారీ విజయం సాధిస్తే డిజిటల్ రైట్స్ విలువ మరింత పెరిగి రూ.200 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని భావించినట్లు టాక్. కానీ బాక్సాఫీస్ ఫలితం అంచనాలకు భిన్నంగా రావడంతో ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘టాక్సిక్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జీ5 సుమారు రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విడుదలకు ముందు వచ్చిన రూ.150 కోట్ల ఆఫర్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. అంటే సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలు, విడుదల తర్వాత వచ్చిన ఫలితం ఓటీటీ మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపించాయో ఈ సంఖ్యలు చెబుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రూ.150 కోట్ల ఆఫర్, రూ.30 కోట్ల ప్రస్తుత ఆఫర్‌కు సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందువల్ల ఇవి ప్రస్తుతం మీడియా, ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారంగానే చూడాల్సి ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలకు థియేట్రికల్, ఓటీటీతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా కీలక ఆదాయ వనరుగా ఉంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో ‘A’ సర్టిఫికెట్ కంటెంట్ కారణంగా టెలివిజన్ ప్రసారానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.
టీవీలో ప్రసారం చేయాలంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించి లేదా మార్చి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే శాటిలైట్ హక్కుల కోసం ప్రత్యేకంగా ఎడిట్ చేసిన వెర్షన్‌ను రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఓటీటీ కోసం కూడా అవసరానికి అనుగుణంగా మరో వెర్షన్ సిద్ధం చేయాలనే ఆలోచన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.