తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతతో రూపొందుతున్న మొట్టమొదటి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” సిద్ధమవుతోంది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగభరితమైన అంబ పాత్ర కథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు మరియు నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి పూనుకున్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ అద్భుత దృశ్యకావ్యానికి జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ చిత్రాన్ని నడిపిస్తున్నారు. ఎంతో పవిత్రమైన హనుమాన్ విజయోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు మరియు క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి సంయుక్తంగా మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ప్రయోగానికి తాము శ్రీకారం చుట్టామని ఎంతో సంతోషంగా వెల్లడించారు. ఈ “అంబ’స్ రివెంజ్” ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన ఏఐ టూల్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. కేవలం సాంకేతికత కోసమే కాకుండా విజువల్స్ రూపకల్పనలో, పాత్రల ఆహార్యాన్ని తీర్చిదిద్దడంలో మరియు కథన నిర్మాణంలో మునుపెన్నడూ చూడని సరికొత్త శైలిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామని వారు స్పష్టం చేశారు. హనుమాన్ విజయోత్సవం వంటి మంచి రోజున ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వినూత్న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను, నటీనటుల మరియు ఇతర సాంకేతిక నిపుణుల సమాచారాన్ని చాలా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ఓ అశోక్ దయ్యాల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత పూర్తిస్థాయి కథాచిత్రాల దిశగా పడుతున్న ఈ అడుగును సినీ పెద్దలు అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ప్రాచీన పౌరాణిక గాథను, నేటి కాలపు అత్యాధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ చేస్తున్న ఈ అరుదైన ప్రయోగం ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకుల్లోనూ, అటు పరిశ్రమ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో సినిమా మేకింగ్ విధానాన్ని ఈ చిత్రం పూర్తిగా మార్చేస్తుందని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.