Tollywood Rewind 2023 | 2023 చివరికి వచ్చేసరికి లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఎవరెన్ని సినిమాలు చేసారు.. ఎన్ని హిట్లు ఇచ్చారు.. అసలు 2023లో వచ్చిన టాప్ హిట్స్ ఏంటి అంటూ అంతా లెక్కలు కడుతున్నారు. మరి ఏ సినిమా ఈ ఏడాది ఎక్కువ వసూలు చేసింది.. ఏది ఎక్కువగా లాభాలు తీసుకొచ్చింది అనేది ఓ సారి చూద్దాం.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్‌గా మంత్ వైజ్‌గా మన హిట్స్ లెక్క కట్టేద్దాం..
వాల్తేరు వీరయ్య:
చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఖైదీ నెం 150 తర్వాత సరైన విజయం కోసం చూస్తున్న మెగాస్టార్ ఆకలిని మొత్తం తీర్చేసాడు వాల్తేరు వీరయ్య. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ల తర్వాత చిరుకు వచ్చిన బ్లాక్‌బస్టర్ ఇది. దాదాపు 230 కోట్ల గ్రాస్.. 140 కోట్ల షేర్ వసూలు చేసింది వాల్తేరు వీరయ్య. లాభాలు కూడా 50 కోట్ల వరకు తీసుకొచ్చింది ఈ చిత్రం.
వీరసింహారెడ్డి:
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికే విడుదలైంది. యావరేజ్ టాక్‌తోనే ఓపెన్ అయినా.. సంక్రాంతి పండగను బాగానే క్యాష్ చేసుకుంది వీరసింహారెడ్డి. రొటీన్ కథ అయినా కూడా ఎమోషన్ వర్కవుట్ అవ్వడంతో బాలయ్యకు మంచి విజయం దక్కింది. ఈ చిత్రం దాదాపు 130 కోట్ల గ్రాస్.. 79 కోట్ల షేర్ వసూలు చేసింది.
రైటర్ పద్మభూషణ్:
జనవరి అంతా కేవలం సంక్రాంతి సినిమాలతోనే సరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఫిబ్రవరి మొదట్లోనే సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 5 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
సార్:
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన సార్ కూడా అద్భుతమైన విజయం సాధించింది. రొటీన్ కథతోనే వచ్చినా కూడా తెలుగు, తమిళంలో కలిపి దాదాపు 40 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చాడు సార్. విద్యా వ్యవస్థపై వెంకీ రాసిన కథ బాగానే పేలింది.
వినరో భాగ్యము విష్ణుకథ:
కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన వినరో భాగ్యము విష్ణుకథ కూడా మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం శ్రీ మురళి అబ్బూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇది దాదాపు 4 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.
బలగం:
మార్చ్‌లోనూ మరుపురాని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయిన బలగం అయితే సంచలనం విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు 11 కోట్లు షేర్ వసూలు చేసి లాభాల పంట పండించింది.
దాస్ కా ధమ్కీ:
ఫలక్‌నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా మారిన హీరో విశ్వక్ సేన్.. రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యాడు. ఈయన హీరోగా నటిస్తూ తెరకెక్కించిన దాస్ కా ధమ్కీ బాగానే ఆడింది. దాదాపు 12 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ధమ్కీ సినిమా.
దసరా:
నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా సమ్మర్లో అదిరిపోయే విజయం అందుకుంది. ఆంధ్రాలోని కొన్ని ఏరియాలలో కలెక్షన్లు తక్కువగా వచ్చాయి కానీ నైజాంలో మాత్రం దుమ్ము లేపింది దసరా. ఈ చిత్రం దాదాపు 65 కోట్ల షేర్.. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
విరూపాక్ష:
ఎప్రిల్లో చాలా సినిమాలు విడుదలయ్యాయి కానీ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన విరూపాక్ష మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన విరూపాక్ష ఏకంగా 45 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.
మే అంతా ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు.
మేం ఫేమస్:
యూ ట్యూబ్‌లో ఫేమస్ అయిన 23 ఏళ్ల సుమంత్ ప్రభాస్.. దర్శకుడిగా మారి తెరకెక్కించిన మేం ఫేమస్ బాగానే ఆడింది. కమర్షియల్‌గా ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి.
సామజవరగమనా:
చాలా కాలంగా సరైన కమర్షియల్ విజయం కోసం చూస్తున్న హీరో శ్రీ విష్ణుకు సామజవరగమనా రూపంలో అదిరిపోయే విజయం దక్కింది. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం 15 కోట్ల వసూళ్లు సాధించి.. దాదాపు 13 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.
బేబీ:
జులైలోనే కాదు.. 2023లోనే లాభాల పరంగా అతిపెద్ద విజయం బేబీ రూపంలో వచ్చింది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 50 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. గ్రాస్ అయితే 90 కోట్లు దాటేసింది. ఈ సినిమాకు 45 కోట్ల వరకు లాభాలు వచ్చాయి.
బెదురులంక 2012:
కార్తికేయ హీరోగా క్లాక్స్ తెరకెక్కించిన బెదురులంక 2012 చాలా వాయిదాల తర్వాత విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రం 2 కోట్ల మేర లాభాలు అందుకుంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి:
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 20 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 6 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చి హిట్ లిస్టులో చేరిపోయింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.
భగవంత్ కేసరి:
సంక్రాంతికి వీరసింహారెడ్డితో వీరవిహారం చేసిన బాలయ్య.. దసరాకు మరో విజయం అందుకున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి కూడా 80 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మంచి కథతో వచ్చిన ఈ చిత్రానికి విజయంతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి.
మా ఊరి పొలిమేర 2:
ఒకప్పుడు కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ హీరోగా మారి నటించిన సినిమా మా ఊరి పొలిమేర 2. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బయ్యర్లకు 4 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.
మంగళవారం:
మహాసముద్రం ఫ్లాప్‌తో డీలా పడిన అజయ్ భూపతి.. మంగళవారంతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఏ సర్టిఫికేట్ సినిమాతో వచ్చినా.. ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హాయ్ నాన్న:
దసరా తర్వాత 2023లో మరో విజయం అందుకున్నాడు నాని. ఈసారి శౌర్యు అనే దర్శకుడిని పరిచయం చేసాడు నాని. ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా వచ్చిన హాయ్ నాన్నకు అన్నిచోట్లా మంచి వసూళ్లు వచ్చాయి. దాదాపు 38 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది.
సలార్:
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాకు ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. షేర్ దాదాపు 280 కోట్లు ఉంది. మరో రెండు వారాలు సినిమాలేం లేవు కాబట్టి సంక్రాంతి వరకు ఇదే సినిమా థియేటర్లలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 350 కోట్లు రావాలి. అంటే మరో 70 కోట్ల దూరంలో ఉంది.
తాజాగా విడుదలైన కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మొత్తానికి ఎప్పట్లాగే 2023లోనూ హిట్లు చాలా తక్కువగా వచ్చాయి. మరి వచ్చే ఏడాదైనా ఈ సక్సెస్ రేట్ పెరుగుతుందో లేదో చూడాలి. ఇక వీటితో పాటు ఈ ఏడాది తరుణ్ భాస్కర్ కీడా కోలా, ఖుషి, పరేషాన్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.