Raviteja | ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో వరస విజయాలు అందుకున్న రవితేజ.. ఆ తర్వాత మళ్లీ చక్రం తిప్పలేకపోయాడు. రొటీన్ స్టోరీస్ ఈయన్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. పైగా సరైన ప్రమోషన్ లేక సినిమాలు దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఈ మధ్యే విడుదలైన ఈగల్ సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఊహించినంతగా రాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ బాగుందని.. టీం ఇంకాస్త ప్రమోట్ చేసుకుని ఉంటే సినిమా కచ్చితంగా సేఫ్ అయ్యేదనే ప్రచారం జరిగినా కూడా ఈగల్ యావరేజ్ కూడా కాలేకపోయింది. మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్లు వచ్చినా.. నాలుగో రోజు నుంచే ఢమాల్ అని పడిపోయింది.
దీనికి ముందు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాల పరిస్థితి కూడా అంతే. రావణాసుర పెద్దగా ఎక్కకపోయినా.. టైగర్ మాత్రం కేవలం లెంత్ సమస్యతోనే ఫ్లాప్ అయింది. వరస ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ బ్యాకప్ మాత్రం అదిరిపోయింది. ఆయన కోసం హిట్టు ఇచ్చిన దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హరీశ్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. రైడ్ సినిమాకు రీమేక్‌గా ఇది వస్తుంది. ఈ సినిమాతో కచ్చితంగా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ధీమాగా చెప్తున్నాడు మాస్ రాజా. మరోవైపు ఈ చిత్ర బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది.
రవితేజ గత సినిమాలతో సంబంధం లేకుండా దీనికి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీశ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. మరోవైపు హరీశ్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. దీని తర్వాత కూడా రవితేజ లైనప్ అదిరిపోయింది. అనుదీప్ కేవీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మాస్ రాజా. జాతిరత్నాలు లాంటి క్లాసిక్ ఇచ్చిన ఈ దర్శకుడు.. రవితేజతో కలిస్తే వచ్చే ఔట్పుట్ అదిరిపోతుంది అంతే. మరోవైపు గోపీచంద్ మలినేని సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మంచి దర్శకులనే క్యూలో పెట్టుకున్నాడు రవితేజ. మరి వీటితో మాస్ రాజా మార్కెట్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.!